close
Choose your channels

వాషింగ్టన్‌లో జనసేన-బీజేపీ.. మధ్యలో చిరంజీవి.. ఏం జరుగుతోంది!

Sunday, July 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వాషింగ్టన్‌లో జనసేన-బీజేపీ.. మధ్యలో చిరంజీవి.. ఏం జరుగుతోంది!

అమెరికాలో తెలుగు ప్రజలంతా కోలాహలంగా జరుపుకుంటున్న తానా మహా సభల్లో ఆసక్తికర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ సభలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ కీలకనేత రాం మాధవ్ రహస్య భేటీ మాత్రం కలకలం రేపుతోంది. అయితే పవన్ కల్యాణే.. రాం మాధవ్‌తో భేటీ కావడం ఇక్కడ కొసమెరుపు. ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరించిన బీజేపీపై గతంలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సుమారు గంటపాటు వీరిద్దరి మధ్య పలు విషయాలపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో వాషింగ్టన్ వేదికగా జనసేన-బీజేపీల మధ్య ఏం జరుగుతోందంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

ఏం చర్చించారు..!?

ఈ సందర్భంగా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీల అమలు, ఇతర అంశాలపై నిశితంగా చర్చించినట్లు సమాచారం. కాగా.. 2019 ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో బీజేపీతో పాటు జనసేన పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయిన విషయం విదితమే. అయితే రానున్న 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీని ఏపీలో బలోపేతం చేసుకోవాలని కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకున్న విషయం విదితమే. అయితే ఈ క్రమంలో బీజేపీకి చెందిన కీలక నేత రాం మాధవ్‌తో పవన్ భేటీ కావడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.

చిరు కోసమేనా..!?

గత కొన్నిరోజులుగా మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ నేతలు చర్చలు జరిపారని.. ఆయన స్పందన కోసం కమలనాథులు వేచి చూస్తున్నారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. చిరు కాషాయ కండువా కప్పుకుంటే రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు సీఎం అభ్యర్థి కూడా మెగాస్టార్‌నే నియమిస్తామని బీజేపీ నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటే పార్టీకి మంచిరోజులొచ్చినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పవన్-రామ్ మాధవ్ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.

కలిసి పనిచేసే ఉద్దేశం లేదు..!

ఈ కీలక భేటీపై రామ్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ తానా సభల్లో పాల్గొనేందుకే వచ్చానన్నారు. పలువురు తెలుగువారు, రాజకీయనేతలను కలిశానని ఆయన చెప్పుకొచ్చారు. భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదని.. ప్రస్తుతం పవన్‌తో కలిసి పనిచేసే ఉద్దేశం లేనే లేదని రామ్‌ మాధవ్‌ తేల్చిచెప్పారు. మోదీ పాలన చూసి చాలామంది బీజేపీలో చేరాలనుకుంటున్నారని ఆయన తెలిపారు. ఏపీ, తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని రామ్‌మాధవ్‌ జోస్యం చెప్పారు. మొత్తానికి చూస్తే తానా సభల్లో రాజకీయం రంజుకుందన్న మాట. తానా సభలు పూర్తయ్యే లోపు ఇంకా ఎన్నెన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.