close
Choose your channels

Private School:తెలుగులో మాట్లాడితే శిక్ష తప్పదు.. బోర్డు వేలాడదీసిన స్కూల్, ఐపీఎస్ అధికారి చురకలు

Saturday, February 25, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశ భాషలందు తెలుగు లెస్స అని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అన్నా.. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులు ప్రశంసించినా అంతా గతం. కమ్మనైన తెలుగు భాష ఇప్పుడు ప్రమాదంలో పడింది. రోజురోజుకు తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఉపాధి అవకాశాలు, కాలంతో పాటు పరుగులు .. ఇలా కారణాలేమైనా ఇప్పుడంతా ఇంగ్లీష్‌మయమే. ఇంగ్లీష్ మాట్లాడకుంటే భవిష్యత్తు ఆందోళనకరంగా వుంటుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అటువైపే ప్రోత్సహిస్తున్నారు. తెలుగును ఇంటికే పరిమితం చేసి.. గడప దాటితే ఇంగ్లీష్ మాట్లాడాలని హుకుం జారీ చేస్తున్నారు.

దిగజారుతున్న తెలుగు భాష పరిస్థితి:

ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో హిందీ తర్వాతి స్థానంలో వున్న తెలుగు రెండో స్థానంలోకి పడిపోయింది. రాబోయే రోజుల్లో ఇది మరింత దిగజారే అవకాశాలున్నాయని తెలుగు భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు చొరవ చూపి తెలుగును రక్షించాలని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటి వాళ్లు పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓ ప్రైవేట్ పాఠశాల తెలుగును అవమానించేలా వ్యవహరించింది. స్కూలు ఆవరణలో తెలుగులో మాట్లాడితే శిక్షిస్తామని విద్యార్ధులను హెచ్చరిస్తూ బోర్డు పెట్టింది. ఈ క్రమంలో అది ఓ ఐపీఎస్ అధికారి కంట పడింది. అంతేకాదు.. ఆ బోర్డులో ‘‘TELUGU’’కు బదులుగా ‘‘TELGU’ అని స్పెల్లింగ్ మిస్టేక్ వుండటంతో ఆయన మరింత ఊగిపోయారు.

మన తెలుగును ఐసీయూలో పెట్టేశారన్న ఐపీఎస్:

దీంతో ఆయన సదరు స్కూలు యాజమాన్యానికి చురకలంటిస్తూ తెలుగుపై అభిమానం చాటుకున్నారు. "ఇది చూస్తే , మన తెలుగును ఐసీయూలో పెట్టి చావును పరిచయం చేస్తున్నట్లుగా లేదూ? ఏ సంస్కృతి వారైనా, కథలో, కళలో, కాజానో, కలంకారో, మాకు మాత్రమే ప్రత్యేకమని చాటుకుంటారు. మన బెంట్ ఆఫ్ మైండులో భాష బెండు కాస్త ఎక్కువే నేమో. మాటల మాంత్రికుడన్నట్టు, శత్రువులెక్కడో ఉండరు" అంటూ ఇచ్చిపడేశారు. ప్రస్తుతం ఐపీఎస్ అధికారి ట్వీట్ వైరల్ అవుతోంది. అటు నెటిజన్లు కూడా స్కూల్‌పై దుమ్మెత్తిపోస్తూ.. తెలుగుపై అభిమానాన్ని చాటుకున్న అధికారిని ప్రశంసిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.