close
Choose your channels

సుప్రీం చరిత్రాత్మక తీర్పు.. రాముడిదే అయోధ్య

Saturday, November 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుప్రీం చరిత్రాత్మక తీర్పు.. రాముడిదే అయోధ్య

న్యూ ఢిల్లీ: దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి శనివారంతో సుప్రీంకోర్టు ముగింపు ఇచ్చేసింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పునిచ్చేసింది. కేవలం గంట వ్యవధిలోనే ఇన్నిరోజులుగా నెలకొన్న వివాదానికి సుప్రీం ఫుల్‌స్టాప్ పెట్టేయడం.. చారిత్రాత్మక తీర్పును వెలువరించడం విశేషమని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ తీర్పును హిందువులకు ఓ శుభవార్తగా చెప్పుకోవచ్చు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కే అప్పగించడం జరిగింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని తీర్పునిచ్చింది. మందిరం నిర్మాణానికి మూడునెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని.. కేంద్రానికి మూడు నెలలపాటు కోర్టు గడువిచ్చింది. అయోధ్య చట్టం కింద ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిర్మొహి అఖాడ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సున్నీ బోర్డు వాదనకు పరిమితస్థాయిలో ఆమోదం లభించింది. కాగా.. అయోధ్యలో ఆలయ నిర్మాణం, ముస్లింలకు 5 ఎకరాల స్థలం కేటాయించింది. దీంతో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది.

శనివారం అసలేం జరిగింది..!

చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే, జస్టిస్‌ ధనుంజయ్‌, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మొత్తం ఐదుగురు అయోధ్య తీర్పును వెలువరించారు. ఏకాభిప్రాయంతో ఐదుగురు న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. నిర్మొహి అఖాడ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సున్నీ వక్ఫ్‌బోర్డు తరచూ మాటమార్చిందని.. అంతర్గతంగా ఉన్న నిర్మాణం ఇస్లామిక్‌ శైలిలో లేదని సీజేఐ తేల్చిచెప్పింది.

సీజేఐ ఏం చెప్పారు!?

‘రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి. బాబర్‌ దగ్గర పనిచేసిన సైనికాధికారులు మసీద్‌ను నిర్మించారు. బాబ్రీ మసీద్‌ నిర్మాణ తేదీపై స్పష్టత లేదు. విగ్రహాలు మాత్రం 1949లో ఏర్పాటు చేశారు. మతపరమైన అంశాల్లో కోర్టు జోక్యం సహేతుకం కాదు. మసీదు కింద పురాతన కట్టడం ఆనవాళ్లు ఉన్నాయన్న ఏఎస్‌ఐ వాదనను తోసిపుచ్చలేం. వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేసేవారని ఆధారాలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేసేవారని ఆధారాలున్నాయి. మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చినట్లు సాక్ష్యాలు లేవు రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది. పురావస్తుశాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలు పరిగణనలోకి తీసుకున్నాం. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత సమన్యాయ సూత్రాలకు విరుద్ధం. మసీదు కూల్చివేత చట్ట విరుద్ధం’ సీజేఐ స్పష్టం చేశారు.

ముస్లీంలకు ప్రత్యేక స్థలం

‘వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్‌ హైకోర్టు 3 భాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదు. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి. భూ కేటాయింపునకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. అయోధ్య చట్టం కింద ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలి. సున్నీ బోర్డు వాదనకు పరిమితస్థాయిలో ఆమోదం. అయోధ్యలో ఆలయ నిర్మాణం, ముస్లింలకు 5 ఎకరాల స్థలం’ అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

వివాదాస్పద స్థలం హిందువులకే..
1993లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్థలానికి వెలుపల సున్నీ వక్ఫ్‌బోర్డుకు స్థలం కేటాయించడం జరిగింది. ట్రస్ట్‌ ద్వారానే రామాలయ నిర్వహణ జరగాలని కోర్టు చెప్పింది. వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.

భారీ భద్రత మధ్య..!

తీర్పు నేపథ్యంలో అయోధ్య భద్రతా వలయంలో ఉన్నది. అయోధ్య ఆలయం వద్దకు యాత్రికులకు అనుమతి నిరాకరించింది. 60 కంపెనీల పీఏసీ, పారామిలటరీ బలగాల మోహరించారు. డ్రోన్‌, సీసీ టీవీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ జరిగింది. అయోధ్యలో హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు సిద్ధం చేసి ఉంచారు. సభలు, ర్యాలీలు, విజయోత్సవాలకు అనుమతి నిరాకరించారు. రెచ్చగొట్టే ప్రకటనలు, హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర హోం శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు.. రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియా సందేశాలు వస్తే ఫిర్యాదు చేసేందుకు యూపీ సర్కార్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది.

మొత్తానికి చూస్తే.. శనివారం నాడు సరిగ్గా 10:30 మొదలైన తీర్పు 11:30 గంటలకు అంటే గంటకే తీర్పునిచ్చేసింది. సుమారు కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న ఈ వివాదానికి సుప్రీంకోర్టు కేవలం గంట వ్యవధిలోనే తేల్చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా ఇది దేవుడికి అనుకూలమైన తీర్పు అని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, మేథావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.