close
Choose your channels

స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు - త్రివిక్ర‌మ్‌

Wednesday, October 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మమ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై .. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 11న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా చిత్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఇంట‌ర్వ్యూ...
 
రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో క‌థ రాయడానికి కార‌ణ‌మేంటి?
 
నిజానికి ముందు ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేద్దామని అనుకోలేదు. రెండు మూడు ఐడియాలు గురించి ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన ఇది. ఒక గొడవ జరిగే ముందు.. గొడవ జరిగే సమయంలో విషయాలు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. గొడవ అయిపోయిన తర్వాత మనం పెద్దగా పట్టించుకోం. కానీ గొడవ తర్వాత సర్దాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఉదాహరణకు భారతంలో యుద్ధ పర్వం తర్వాత.. మిగతా పర్వాలను పెద్దగా ఎవరూ చదవం. పురాణాలను చెప్పేవాళ్లు కూడా ఆ విషయాను పెద్దగా వర్ణించరు. అందుకు కారణం అంత బాధకరమైన అంశాలను జనాలకు చెప్పకూడదనే. అంత బాధాకరమైన విషయాలను చెబితే జీవితంపైనే ఉన్న ఆసక్తి పోతుంది. అందుకనే ఆ విషయాలను ఎవరూ టచ్‌ చేయరు. ఘటన జరగడానికి ముందు.. తర్వాత యాక్షన్‌ మిక్స్‌ అవడంతో ఎమోషన్స్‌కు మనం కనెక్ట్‌ అవుతాం. ఇంతకు ముందు సక్సెస్‌ అయిన ఫ్యాక్షన్‌ సినిమాలను గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. పోయినవాళ్ల ఫ్యామిలీలు.. ఉన్నవాళ్ల ఫ్యామిలీల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది.. కచ్చితంగా కొత్త యాంగిల్‌ అవుతుందనిపించింది. ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. గొడవల్లో ఇప్పటి వరకు ఆడవాళ్లను ఎవరూ ఇన్‌వాల్వ్‌ చేయలేదు. ఎందుకనో మనం ఇంట్లో ఆడవాళ్లను పెద్దగా పట్టించుకోం. అలా కాకుండా వాళ్లని కన్‌సిడర్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను కథగా రాసుకుని ఎన్టీఆర్‌కు చెప్పాను. తనకు బేసిక్‌గా ఈ ఆలోచన నచ్చింది.
 
ఎన్టీఆర్‌ కుటుంబంలో విషాదం తర్వాత షూటింగ్‌కు రావ‌డం ...?
 
నిజానికిమేం సినిమా రిలీజ్‌ ఫిక్స్‌ కాలేదు. ముందు ఆగస్ట్‌ 29 అనుకున్నాం. ఆ తర్వాత సినిమాను మార్చిలో సినిమాను విడుదల చేయాలని నేను, చినబాబుగారు ఫిక్స్‌ అయిపోయాం. కానీ ఎన్టీఆర్‌ కుటుంబంలో విషాదం జరిగిన రోజు ఆయనతోనే ఉన్నాం. ఆయన అప్పుడేం మాట్లాడలేదు కానీ.. రెండో రోజు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎన్టీఆర్‌గారే ఫోన్‌ చేశారు. 'ఎట్టి పరిస్థితుల్లో మనం అక్టోబర్‌ 11కే వస్తున్నాం. ఈ విషయాన్ని చినబాబుగారికి కూడా చెప్పండి' అని అన్నారు. 'ఇప్పుడేం పరావాలేదు.. పదిరోజుల తర్వాత మాట్లాడుకుందాం' అని అన్నాను. 'పదిరోజులా! అంత లేదు.. ఇప్పటికే షూటింగ్‌ ఆలస్యమైంది.. పూజా కూడా ఇక్కడే స్టే చేస్తుంది. మూడు రోజుల వరకు నేను బయటకు రాకూడదు' అన్నారు. నాలుగో రోజు ఆయన సెట్‌కు వచ్చారు.
 
జ‌గ‌ప‌తిబాబు పాత్ర ఎలా ఉంటుంది?
 
కొంత‌మంది చాలా మూర్ఖంగా ఉంటారు. కొన్ని పాత్ర‌లు ముందే నిండుగా ఉంటాయి. మ‌నం గ్లాసులో అమృతం పోద్దామ‌నే అనుకుంటాం. కానీ వాడు మందుగానే మంచినీళ్లు పోసుకుని వ‌చ్చి ఉంటాడు. వాడిని మ‌న‌మేం చేయ‌లేం. అలాంట‌ప్పుడు మ‌న‌కు ఇరిటేట్‌గా ఉంటుంది. విన‌ని వాళ్ల‌ను చూస్తే ప‌ళ్లు బిగించాల‌నిపిస్తుందిగా. `విన్రా ఎందుకు.. ` అనే ఫీలింగ్ అనుకుంటాం క‌దా. అలాంటి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు క‌న‌ప‌డ‌తారు.
 
ఎన్టీఆర్‌తో ప్ర‌యాణం గురించి చెప్పండి?
 
నాన్న‌కు ప్రేమ‌తో నుంచి మొద‌లైంది... ఆయ‌నేమో ఆ సినిమా చేస్తున్నారు. నేనేమో అ..ఆ.. చేస్తున్నా. అప్ప‌టి నుంచి సీరియ‌స్‌గా సినిమా చేయాల‌నే థాట్ వ‌చ్చింది. త‌ప్ప‌కుండా చేద్దామ‌ని అనుకుని అప్ప‌టి నుంచే బ‌లంగా కూర్చున్నాం. నాతో ఉన్న స‌మ‌స్య అంటే రాత్రి నాకు ఏదో ఒక ఐడియా వ‌స్తుంది.. లేచి కూర్చుని సూప‌ర్ అని రాసుకుంటా. నిద్ర‌లేచి చూస్తే నాకే సిగ్గుగా ఉంటుంది. ఈ ఐడియా ఎందుకు రాశానా? అని. అఫ్‌కోర్స్ నేను తీసిన సినిమాలు చాలా చూసిన‌ప్పుడు కూడా అనిపిస్తుంది కానీ.. ఇప్పుడు కూడా అనిపించింది.
 
పెనిమిటి సాంగ్ పెట్టాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది?
 
-క‌థ ముందు అంద‌రిలాగానే హీరోయిజ‌మ్ ఉండాల‌ని మొద‌లుపెడ‌తాం. ముందు హీరోయిజ‌మ్‌, హీరోని ఎలా ఇంప్రెస్ చేయాల‌ని ఆలోచిస్తాం. ఆ త‌ర్వాత ఏదో ఒక ఆలోచ‌న వ‌స్తుంది. ఆ ఆలోచ‌న కొన్నిసార్లు మంచిద‌వుతుంది. కొన్నిసార్లు చెడ్డ‌ద‌వుతుంది. కొన్నిసార్లు ఎలాంటి ట‌ర్న్ తీసుకోకుండా ఫ్లాట్‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఈ సారి ఈ ట‌ర్న్ కుదిరింది. ఆ యాంగిల్ మీద పెద్ద వెయిట్ వేయ‌కుండా చేశాం.
 
రాయ‌ల‌సీమ యాస కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?
 
- కొంత‌మంది రాయ‌ల‌సీమ క‌వుల‌ను క‌లిశాను. తిరుమ‌ల రామ‌చంద్ర‌గారి సాహిత్యంతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. నేను అప్ప‌టికే నామిని సాహిత్యానికి పెద్ద ఫ్యాన్‌ని. కాక‌పోతే ఆయ‌న తాలూకు చిత్తూరు జిల్లా భాగం. అక్క‌డ క‌రువు ప్రాంతం. అక్క‌డ ఫ్యాక్ష‌న్‌, క‌క్ష‌లు, కార్ప‌ణ్యాలు లేవు. నాకు క‌డ‌ప‌, అనంత‌పూరు ఏరియాల్లో.. ఫ్యాక్ష‌న్ ఉంది. ఇక్క‌డున్న క‌రువు ఫోర్స్డ్ క‌రువు. పెనిమిటి పాట కూడా ప్రాసెస్‌లో ఉంది కాబ‌ట్టి కుదిరింది. అంద‌రి ఆడ‌వాళ్ల‌కీ హీరో మ‌ద‌ర్‌ని సింబ‌లైజ్ చేశాం. నేను చెప్ప‌గానే అంద‌రికీ న‌చ్చిన కాన్సెప్ట్ ఇది.
 
ఫ్యాక్ష‌న్‌, యాక్ష‌న్ అయినా.. మీర‌నేస‌రికి.. మీ స్ట‌యిల్ ఆఫ్ కామెడీని కోరుకుంటారు క‌దా?
 
సినిమా ప్రారంభంలో కాస్త కామెడీ ఉంటుంది. కానీ ఎక్క‌డా ఫోర్స్‌డ్‌గా ఉండ‌దు. ఇది వ‌ర‌కు అయితే బ్ర‌హ్మానందంగారి లాంటి వారిని ప‌ట్టుకొచ్చి ఒక ఐటెమ్ చేసేవాళ్లం క‌దా.. అలా ఐట‌మ్ చేయ‌ద‌ల‌చుకోలేదు. కొంచెం స్ట్రిక్ట్ గా క‌థ ఏం చెబుతుందో అదే విందామ‌ని అనుకున్నా.
 
స‌క్సెస్, ఫెయిల్యూర్స్ గురించి ?
 
పెద్ద ప‌ట్టించుకోను. నాకు ఏదైనా కొత్త‌గా చూసిన‌ప్పుడు, చ‌దివిన‌ప్పుడు మాత్ర‌మే కిక్ వ‌స్తుంది. హిట్‌, ఫ్లాప్‌లు ప‌ట్టించుకోనంటే అబ‌ద్ధ‌మే. ప‌ట్టించుకుంటా. కానీ ఓ.. పిసికేసుకోను. నాకు అత్తారింటికి దారేది వ‌చ్చిన‌ప్పుడు అలాగే ఉంటా. అజ్ఞాత‌వాసి వ‌చ్చిన‌ప్పుడూ అలాగే ఉంటా. ఫ్లాప్ అయిన‌ప్పుడు బాధ‌ప‌డ‌తా. కాక‌పోతే ఓ రెండు, మూడు రోజులు.. అంతే. అయిపోయిన త‌ప్పులు మ‌న‌కు తెలుస్తాయి. చూడ‌కూడ‌ద‌నుకుంటే ఎప్ప‌టికీ చూడం. తెలుసుకోవాల‌నుకుంటే మాత్రం వెంట‌నే తెలుస్తుంది. దానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు.
 
`అజ్ఞాత‌వాసి` కొన్నాళ్ల త‌ర్వాత వ‌చ్చి ఉంటే బావుండేద‌ని మీరు ఒపీనియ‌న్ ఎక్స్ ప్రెస్ చేసిన‌ట్టున్నారు?
 
నేనెప్పుడూ ఎవ‌రికీ చెప్ప‌లేదే. ఖ‌లేజాకు కూడా నేనప్పుడు చెప్ప‌లేదు. ఖ‌లేజా నాకు ఇష్ట‌మైన సినిమా అని ఎవ‌రైనా అన్నా నేను బ్లాంక్‌గా చూస్తా. నేను అలాంటి రియ‌క్ష‌న్ తీసుకోలేదు. నాప్రొడ్యూస‌ర్‌కి లాస్ అయింది కాబ‌ట్టి నేను అజ్ఞ‌త‌వాసి రెమ్యూన‌రేష‌న్ బ్యాక్ ఇచ్చా. మిగిలిన వాళ్లు ఎవ‌రూ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అడ‌గ‌లేదు. ఇదివ‌ర‌కు కూడా ఇన్‌స్టెంట్‌గా రియాక్ష‌న్ ఉండేది. కాక‌పోతే అది మ‌నం చెప్ప‌డానికి ప‌క్క‌న ఫ్రెండో, వైఫో, పిల్ల‌లో ఉండేవారు. కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది. వెంట‌నే అందులో టైప్ చేసి పెట్టేస్తున్నాం. కాక‌పోతే ఇది రికార్డ్ అయిపోతుంది. అప్పుడూ, ఇప్పుడూ మ‌నుషులు మార‌లేదు. అలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అది ఉంటుంది. డ‌స్ట్ బిన్ మెళ్లో వేసుకుని తిర‌గ‌డం దేనికి.. ఫ్ల‌వ‌ర్ బొకే అయితే తిరుగుతాం. సినిమా న‌చ్చ‌డానికి ల‌క్ష కార‌ణాలుంటాయి. న‌చ్చ‌క‌పోవ‌డానికి ల‌క్ష కార‌ణాలుంటాయి. దాని గురించి మ‌నం ఏమీ మాట్లాడ‌లేం. మాట్లాడేకొద్దీ మ‌నం వీక్ అవుతామే త‌ప్ప‌, ఇంకేమీ జ‌ర‌గ‌దు.
 
మీ స్నేహితుడు సునీల్ క‌మెడియ‌న్‌గా ఎంట్రీ ఇచ్చారుగా?
 
సునీల్ గ‌త‌రెండేళ్లుగా అత‌ను అంటూనే ఉన్నాడు. నేను ఇందులో బంధీనైపోయాను. ఎలాగైనా బ‌య‌ట‌ప‌డాలి. ఏదో ఒక‌టి చేయాలి అని.. అప్పుడు నేన‌న్నా.. అది నేచుర‌ల్‌గా జ‌రుగుతుంది. నువ్వు పెద్ద దాని గురించి ఆలోచించ‌కు అని. నీ చేతిలో ఉన్న క‌మిట్‌మెంట్స్ అన్నీ ముందు పూర్తి చెయ్‌. ఆ త‌ర్వాత హీరోగా కొత్త‌వేవీ ఒప్పుకోవ‌ద్దు. అప్పుడు నేచుర‌ల్‌గా ఎందుకు జ‌ర‌గ‌దో చూద్దాం అని అన్నా.ఎప్పుడైతే సునీల్ మెంట‌ల్‌గా దాన్నుంచి బ‌యటికి వ‌చ్చాడో, అప్పుడే ఆటోమేటిగ్గా అంద‌రికీ తెలిసిపోయింది.
 
మాట‌ల‌మాంత్రికుడు అనేది కిరీట‌మా?
 
యాంక‌ర్లు మాట్లాడ‌టం మొద‌లుపెట్ట‌గానే నేను స్టేజ్ ఎక్కేస్తాను. వాళ్లు నాలుగైదు లైన్లు రాసుకుంటే మొద‌టి లైన్లోనే నేను స్టేజ్ మీద‌కు వెళ్తా. రైట‌ర్‌, డైరెక్ట‌ర్ అని న‌న్ను నేను రెండుగా విభ‌జించి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. రాముడు-భీముడు సినిమాలో లాగా నేను ఇద్ద‌రిని కాదు. నేను అత‌డులాంటి సినిమాలు తీసినా అందులో డైలాగులు బాగా రాశాన‌నే అంటారు. అంత మాత్రాన దాన్ని నెగ‌టివ్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అలాగ‌నిదాన్ని కిరీటంగా భావించాల్సిన ప‌నిలేదు.
 
కొత్త కుర్రాళ్ల‌ని అబ్జ‌ర్వ్ చేస్తుంటారా?
 
నేను ప్ర‌తి సినిమానూ థియేట‌ర్‌కి వెళ్లి చూస్తా. మంచి సినిమాను చూసిన‌ప్పుడ‌ల్లా నాకు జెల‌సీ వ‌స్తుంది. నా మీద నాకు కోపం వ‌స్తుంది. ఇంకా బాగా తీయాల‌నిపిస్తుంది. `అర్జున్ రెడ్డి, రంగ‌స్థ‌లం, కేరాఫ్ కంచ‌ర‌పాలెం, ఆర్ ఎక్స్ 100, పెళ్లిచూపులు, గూడ‌చారి` వంటి సినిమాలు. అలాగ‌ని అన్నీ హిట్ సినిమాలు న‌చ్చాల‌నేం లేదు. నేను కొన్ని హ‌ట్ సినిమాల‌ను వ‌దిలేశాను. `గూఢ‌చారి` వెరీ ఎప్రిషియేటెడ్ మూవీ. అంత లిమిటెడ్ రిసోర్స‌స్‌తో ఒకే జాన్రాలో, అంత టైట్‌గా చెప్ప‌డం మామూలు విష‌యం కాదు.
 
ఓ ద‌ర్శ‌కుడికి బ‌డ్జెట్ గురించి తెలియాల్సిన అవ‌స‌రం ఉందంటారా? లేదంటారా?
 
కొంచెమే ఉండాలి సార్‌... ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు. ఎక్కువుంటే క‌థ రాసేట‌ప్పుడే ఇట‌లీలో జ‌రిగే క‌థ‌.. ఇండియాలోకి.. ఇంకెక్క‌డో జ‌రిగేది ఇంట్లోకి.. ఇలా మెల్ల‌గా మారిపోతుంది.
 
క‌చ్చితంగా హిట్ కొట్టాల‌నే ప్రెజ‌ర్ ఉందా?
 
మ‌న చేతిల్లో ఏమీ లేదు సార్‌. కాక‌పోతే సినిమా మొద‌లుపెట్ట‌డానికి ముందు ఆలోచించా. కానీ ఒక్క‌సారి మొద‌లుపెట్టిన త‌ర్వాత జ‌ర్నీ ఎగ్జ‌యిట్‌మెంట్‌, ఎంజాయ్‌మెంట్ ఉండ‌నే ఉంది. ఒక‌రోజు ఓ మంచి సీన్ వ‌స్తే నాకు ఎంజాయ్‌గా ఉంటుంది.
 
అనిరుధ్‌ను రీప్లేస్ చేయ‌డానికి కార‌ణం?
 
నిజానికి ముందు అనిరుధ్‌నే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకున్నాం. అయితే త‌నకు తెలుగు సినిమా అర్థం కావ‌డానికి... త‌న సంగీతం నాకు అర్థం కావ‌డానికి కాస్త గ్యాప్ తీసుకుంటే మంచిద‌ని నేనే త‌న‌కి చెప్పాను. అందువ‌ల్ల త‌న ప్లేస్‌లో థ‌మ‌న్‌ను తీసుకున్నాం. భ‌విష్య‌త్‌లో త‌న‌తో త‌ప్ప‌కుండా సినిమా చేస్తాను.
 
మ‌హిళ ప్రాధాన్య‌త ఉన్న టైటిల్సే పెడ‌తున్న‌ట్లున్నారుగా?
 
అలాంటి టైటిల్స్ పెట్టాల‌ని నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకోను. హీరోయిన్స్‌ను గ్లామ‌ర్‌గా చూపించ‌మ‌ని డైరెక్ట‌ర్స్ అడిగినా నాకు తెలియ‌ద‌నే చెప్పేస్తాను. ఎందుకంటే నాకు అలా చూపెట్ట‌డం తెలియ‌దు. నేను ట్రై చేయ‌లేదు.
 
సినిమాలు చేయమని మీరు పవన్‌కి సలహా ఇచ్చారా? రాజకీయాల్లోకి సలహాలు ఇస్తారా?
 
ఎంత అమాయకంగా ప్రశ్నలు అడుగుతారండీ! మీకు తెలియదు... ఆయన ఏం చేసినా వాళ్ళ అన్నయ్యకు, వాళ్ళ అమ్మకు చెప్పడు. అందరూ తెల్లారిన తరవాత పేపర్‌లో చదువుకోవడమే.
 
మీ ఫ్రెండ్ షిప్ ఎలా ఉంది?
 
జీవితంలో నేను ఒక్కసారి ఎవరికైనా ఫ్రెండ్‌ అయితే ఫ్రెండే. నా భీమవరం ఫ్రెండ్స్‌ ఇప్పటికీ వాళ్లే నా ఫ్రెండ్స్‌. ఇక్కడికి వచ్చాక ఎవరు ఫ్రెండ్స్‌ అయితే వాళ్లే ఫ్రెండ్స్‌. అందరితో నేను బావుంటాను. మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌... ఒక్కసారి నా జర్నీ స్టార్ట్‌ అయితే చచ్చేవరకూ ఆగదు. నేను ఏది నమ్ముతాను అంటే.. భార్య ఇచ్చే సలహాలు భర్త ఎన్ని వింటాడు. అలాగని, భార్యను ఎందుకు వదలడు? ఆ రిలేషన్‌షిప్‌లో ఒక సెన్స్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ ఉంటుంది. స్నేహితులు గానీ... కుటుంబం గానీ... సలహాలు ఇవ్వాలనో, ఎడ్యుకేట్‌ చేయాలనో కాదు. ఇట్స్‌ సెన్స్‌ ఆఫ్‌ కంఫర్ట్‌. స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. మనల్ని జడ్జ్‌ చేయకుండా మన భావాల్ని పంచుకోవాలి. పవన్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌... ఈ స్థాయికి వచ్చిన వ్యక్తులకు సలహాలు ఏం ఇస్తాం. 18 ఏళ్ళ వయసులో సూపర్‌స్టార్‌ అయ్యి, 20 ఏళ్ళ వయసులో ‘సింహాద్రి’ చేశాడంటే మెంటల్‌గా ఎంత బలం ఉండాలి. ఆడుతూ పాడుతూ ఉండే వయసులో, వ్యామోహాలకు లోనయ్యే వయసులో అంత పెద్ద సినిమాలు చేశారంటే మనం ఏం సలహాలు ఇవ్వాలి. వాళ్లు మనకు సలహాలు ఇచ్చే స్థితికి రాకుండా ఉంటే చాలు.
 
మ‌హేశ్‌తో సినిమా అని వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా?
 
కుద‌ర‌ట్లేదండి.. ఇద్ద‌రం బిజీగా ఉంటున్నాం.
 
మీ నెక్ట్స్‌ సినిమా అల్లు అర్జున్‌తో అంటున్నారు?
 
ఇంకా ఏమీ ఫైనలైస్‌ కాలేదు. ఇప్పుడు చెప్పడం కరెక్ట్‌ కాదు. ‘అరవింద సమేత..’ గురించి మాత్రమే మాట్లాడుకుందాం!
 
వెంకటేశ్‌తో సినిమా ఉంటుందన్నారు!
 
అవును. ఆయనతో సినిమా చేయాలి. అయితే.. ఇద్దరికీ ‘వావ్‌’ అనిపించే కథ దోరకలేదు. రెండుమూడు అనుకున్నాం. రెండోరోజు ఉదయానికి పక్కన పెట్టేశా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.