close
Choose your channels

ఏపీ కెబినెట్‌లో ఏం చర్చించారు.. కీలక నిర్ణయాలేంటి!?

Friday, December 27, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ కెబినెట్‌లో ఏం చర్చించారు.. కీలక నిర్ణయాలేంటి!?

నవ్యాంధ్రకు మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కెబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రాజధాని అంశంపై తాడో పేడో తేల్చేందుకు గాను ఈ సమావేశంలో రాజధాని తరలింపుతో పాటు పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించారు. సుమారు 2:15 గంటలు పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని కేబినెట్ కీలక నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

రిజర్వేషన్లు ఖరారు చేశాం!
‘స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేశాం. స్థానికసంస్థల ఎన్నికలకు పాత పద్ధతిలోనే రిజర్వేషన్లకు ఆమోదం లభించింది. కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్‌ బోర్డుకు 4ఎకరాలు కేటాయించాం. 654 అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ. 60 కోట్ల 50 లక్షలు ఇస్తున్నాం. కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్‌ బోర్డుకు 4 ఎకరాలు బదలాయింపు చేశాం. పసుపు, మిర్చి, ఉల్లికి మద్దతు ధరను ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్‌కు బాధ్యతలు అప్పగించాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుంది’ అని నాని చెప్పుకొచ్చారు.

కచ్చితంగా దర్యాప్తు చేస్తాం..!
‘రాజధాని భూముల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తాం. నైతిక విలువలను దిగజార్చేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. భారీస్థాయిలో భూములు ఎవరెవరు కొన్నారో విచారణలో తేలుస్తాం. న్యాయనిపుణుల సలహా తీసుకుని లోకాయుక్త లేదా సీబీఐ దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటాం. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా గత ప్రభుత్వంలోని పెద్దల తీరు ఉంది. రాజధాని ప్రకటనకు ముందే డ్రైవర్లు, ఇంట్లో పనివాళ్ల పేరుతో భారీగా భూములు కొన్నారు. వాళ్లు కోరుకున్నట్టుగానే సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం. రాజధాని భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తాం. సీఆర్డీఏలో జరిగిన అవినీతిపై కేబినెట్‌ సబ్‌కమిటీ నివేదిక ఇచ్చింది. అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం. రాజధాని ప్రకటనకు ముందే మాజీ మంత్రులు, కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్లు, ఇంట్లో పనివాళ్ల పేరుతో భారీగా భూములు కొన్నారు. వీటిన్నంటిపైనా వాళ్లు కోరుకున్నట్టుగానే సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం’ అని మంత్రి నాని ఆరోపించారు.

ఎప్పుడు రాజధాని నిర్మించేది!?
‘గత ప్రభుత్వంలో నారాయణ కమిటీ రిపోర్ట్‌ ఆధారంగా ఊహాజనిత రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను కాదని నారాయణ కమిటీ నివేదిక ఆధారంగా భూసమీకరణ చేశారు. సంక్షేమ పథకాలు, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు పక్కనపెట్టి రాజధాని నిర్మించే పరిస్థితి వస్తే హైదరాబాద్‌ స్థాయి నగరాన్ని ఎప్పుడు నిర్మిస్తాం?. రూ.లక్ష కోట్ల తేవాలంటే ఎంత కాలం పడుతుందో ప్రజలు అంచనా వేసుకోవాలి. గత ఆర్థిక మంత్రి మేమే తెగలిగినంత తెచ్చాం. ఇంకెవరు అప్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెండింగ్‌ ప్రాజెక్టులకు రూ.25వేల కోట్లు అవసరం. ఆస్పత్రుల అభివృద్ధికి రూ.14 వేల కోట్లు, పాఠశాలల అభివృద్ధికి రూ.12వేల కోట్లు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ నీటిపారుదలకు మరో లక్ష కోట్ల అవసరం ఉంది. అమ్మ ఒడికి రూ.6వేల కోట్ల అవసరం ఉంది. పేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం రూ.45వేల కోట్ల అవసరం’ అని నాని వెల్లడించారు.

విజయసాయి వ్యక్తిగతం!
‘జీఎన్ రావు కమిటీ అనంతరం మరో కమిటీని ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఇందులో మంత్రులు, సీనియర్‌ అధికారులు ఉంటారు. విజయసాయిరెడ్డి విశాఖ వైసీపీ ఇన్‌చార్జ్‌గా మాట్లాడి ఉండవచ్చు. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని మంత్రి స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.