close
Choose your channels

శాసనసభా పక్షనేతగా వైఎస్ జగన్.. టార్గెట్ 2024

Saturday, May 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ అధినేత, త్వరలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని 151 మంది ఎమ్మెల్యేలు ఏక‌వాక్య తీర్మానంతో శాస‌న‌స‌భ‌ పక్ష నేతగా ఎన్నుకున్నారు.

సీనియర్ నేత బొత్స స‌త్యనారాయ‌ణ ప్రతిపాదించ‌గా ఎమ్మెల్యేలు ధ‌ర్మాన ప్రసాద‌రావు, పార్థసార‌ధి, ఆదిమూల‌పు సురేష్‌లు బ‌ల‌ప‌రిచారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు అంద‌జేయ‌నున్నారు. వైఎస్ జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు.

టార్గెట్ 2024..

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలిచింది వైసీపీనే అన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చామని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తామన్నారు. "151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేశాం. అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనం. 50 శాతం కూడా వైసీపీకే పడింది. ఈ విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

మన పార్టీ నుంచి అన్యాయంగా చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23, ఎంపీలు ముగ్గురు ఇప్పుడు టీడీపీకి మిగిలింది. చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23. దేవుడు చాలా గొప్పగా ఈ స్క్రిప్ట్ రాశాడు. మన టార్గెట్ 2024. 2024లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవాలి. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పెర్ఫార్మెన్స్ చూసి ప్రజలు 2024లో మనకు ఓటెయ్యాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తాను.

ఆ ప్రక్షాళన మామూలుగా ఉండదు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేవిధంగా ప్రక్షాళన చేస్తాను. ఆ ప్రక్షాళనకు మీ అందరి సహాయసహకారాలు కావాలి.. అందించాలి. మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయ్.. వాటిని కూడా క్లీన్‌స్వీప్ చేయాలి. ఈ విజయానికి కారణం నాతోపాటు మీ అందరూ.. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారు. 2024లో ఇంతకంటే గొప్పగా గెలవాలి" అని జగన్ చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.