close
Choose your channels

AP High Court: విపక్షాలకు ఊరట, జగన్ సర్కార్‌కు షాక్.. జీవో నెం.1ని సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్ట్

Thursday, January 12, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో రహదారులపై రోడ్ షోలు, సభలు, సమావేశాలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం 1ని ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఈ నెల 23 వరకు జీవో నెం.1ని సస్పెండ్ చేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్ట్ .. జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్ధంగా వుందని అభిప్రాయపడింది.

వరుస తొక్కిసలాటల నేపథ్యంలో జీవో నెంబర్ 1:

కాగా.. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు, గుంటూరుల్లో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటలు చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2న జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడం నిషేధం. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి, పోలీసుల సూచనలు తీసుకుని సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే విపక్ష నేతలు జనంలోకి రాకుండా అడ్డుకునేందుకే జీవో నెంబ ర్ 1ని ప్రభుత్వం తీసుకొచ్చిందని.. టీడీపీ, జనసేన, వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాదు... కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ వెంటనే బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా జగన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.

జీవో నెంబర్ 1పై లా అండ్ ఆర్డర్ డీజీ వివరణ :

ఇదిలావుండగా.. జీవో నెం.1పై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్ వివరణ ఇచ్చారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం విధించలేదని.. నిబంధనలకు అనుగుణంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. 1861 పోలీస్ చట్టానికి అనుగుణంగానే జీవో నెం.1 తీసుకొచ్చినట్లు రవిశంకర్ తెలిపారు. రవాణా వ్యవస్థకు అవరోధం కలుగుతుందనే ఉద్దేశంతోనే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలు, సమావేశాలు, రోడ్ షోలకు పోలీసులు అనుమతులు నిరాకరించే అవకాశం వుందని ఆయన చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.