close
Choose your channels

హరీశ్‌రావు‌పై వ్యాఖ్యలు.. మైనంపల్లిపై చర్యలకు బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధం, మల్కాజిగిరికి మరొకరు..?

Wednesday, August 23, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హరీశ్‌రావు‌పై వ్యాఖ్యలు.. మైనంపల్లిపై చర్యలకు బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధం, మల్కాజిగిరికి మరొకరు..?

బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్‌రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనకు, తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని.. లేదంటే స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. అంతేకాదు.. మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం ఏంటీ.. ఆయన అడ్రస్ గల్లంతు చేస్తానంటూ వ్యాఖ్యానించారు. మైనంపల్లి వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. కేసీఆర్, కేటీఆర్, కవిత తదితరులు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ హరీశ్‌రావుకు బాసటగా నిలిచారు.

మల్కాజిగిరి కోసం కొత్త పేర్లు పరిశీలన :

అయితే అంతటితో ఆగకుండా మైనంపల్లిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధిష్టానం యోచిస్తోంది. దీనిలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో మైనంపల్లిని తప్పించి అతని స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మరో రెండు పేర్లను పరిశీలిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తే విజయావకాశాలు ఎక్కువగా వుంటాయన్న దానిపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తనకు , తన కుమారుడికి టికెట్లు ఇవ్వాలన్న మైనంపల్లి :

కాగా.. మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా ఈసారి తన కుమారుడికి కూడా టికెట్ ఇప్పించుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. తన కుటుంబానికి పట్టున్న మెదక్ నుంచి కుమారుడు రోహిత్‌ను బరిలోకి దింపాలని మైనంపల్లి ప్లాన్ చేశారు. అటు రోహిత్ కూడా గత కొద్దినెలలుగా పలు కార్యక్రమాలను చేస్తున్నాడు. అయితే బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించానికి కొద్దిగంటల ముందు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను, తన కుమారుడు రెండు స్థానాల నుంచి పోటీ చేస్తామని చెబుతూ.. మంత్రి హరీశ్‌రావును టార్గెట్ చేశారు. కానీ కేసీఆర్ వీటిని పట్టించుకోకుండా మల్కాజిగిరి నుంచి మైనంపల్లికి, మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించి.. రోహిత్‌ను పట్టించుకోలేదు.

కార్యకర్తలతో భేటీ తర్వాత నిర్ణయం చెబుతానన్న మైనంపల్లి:

ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. మెదక్, మల్కాజిగిరి ప్రజలు, అభిమానులు, కార్యకర్తల మద్ధతు తనకుందని తన కుమారుడికి టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తామని మైనంపల్లి ధీమా వ్యక్తం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.