close
Choose your channels

టాలీవుడ్‌లో నివురు గప్పిన విబేధాలు.. అసలెందుకిలా..!?

Thursday, May 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్‌లో నివురు గప్పిన విబేధాలు.. అసలెందుకిలా..!?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయా..? నిన్న మొన్నటి వరకూ ఇండస్ట్రీ మొత్తం ఏకథాటిపైనే ఉందనుకున్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయా..? ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తున్నారు..? మరోవైపు నందమూరి బాలయ్య ఏం చేస్తున్నారు..? అసలు మెగాస్టార్ ఇంట్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏం చర్చ జరిగింది..? సీఎం కేసీఆర్ సమక్షంలో ఏమేం చర్చించారు..? ఈ భేటీలపై బాలయ్య ఎందుకిలా అన్నారు..? ఎన్టీఆర్ ఘాట్ వేదికగా బాలయ్య ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేసినట్లు..? అసలు బాలయ్యతో ఏం జరుగుతుందిలే అని కొందరు పెద్దలు మిన్నకుండిపోయారా..? లేకుంటే ఆయనకు అంత ఫేస్ వ్యాల్యూ లేదని పిలవలేదా..? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది కొందరి కోసమే పనిచేస్తోందా..? సినీ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది..? బాలయ్య వ్యాఖ్యలతో టాలీవుడ్ పెద్దలు ఏమనుకుంటున్నారు..? ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా..? లేకుంటే మరింత ముదురుతుందా..? అనే విషయాలను www.indiaglitz.com అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇందులో సీక్రెట్ ఏముంది..!?

నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో సినీయర్ హీరో.. సుధీర్ఘ సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వ్యక్తని అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకూ.. సీనియర్ హీరోకూ తీసిపోరు. అయితే అలాంటి వ్యక్తి.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ, కొందరు నటులను ఉద్దేశించి.. ఇందులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కూడా కలిపేసి మాట్లాడేయటం గమనార్హం. వాస్తవానికి కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్‌, రిలీజ్‌లు, థియేటర్లు మూసివేయడం గానీ మొట్ట మొదట టాలీవుడే చేసింది. అంతేకాదు.. ఈ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన కార్మికులను కాపాడుకోవడానికి సీసీసీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్‌కు అనుమతులివ్వాలనే విషయమై మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఇదేం సీక్రెట్‌గా కాదు.. టాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాతలు, దర్శకులు, కొందరు స్టార్ హీరోలు సైతం విచ్చేశారు. ఆ తర్వాత అందరూ ఓ మాట అనేసుకుని ఫైనల్‌గా అదే మంత్రి ఆధ్వర్యంలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి షూటింగ్స్, థియేటర్ల ఓపెనింగ్‌పై చర్చించగా సానుకూలంగానే స్పందించి కొన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరికొన్ని విషయాలు తర్వాత మాట్లాడదామని భరోసా ఇచ్చి పంపారు. ఈ మొత్తం చర్చలకు ఫలితమే జూన్-01 నుంచి షూటింగ్స్ ప్రారంభం కానున్నాయ్. ఇందుకు సంబంధించి ఇటు టాలీవుడ్ పెద్దల నుంచి వచ్చిన వీడియో.. అటు సీఎం నుంచి ప్రకటనలు కూడా ఉన్నాయ్ ఇందులో దాపరికం ఏముంది..?. కానీ బాలయ్య మాత్రం ఇండస్ట్రీలో ఏదో జరిగిపోతోందని.. భూములు గురించి మాట్లాడేసుకున్నారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా..? అని వ్యాఖ్యానించడంతో ఆయన మాటలకు అర్థాలే వేరులే అని పలువురు పెద్దలు అనుకుంటున్నారట.

సి. కళ్యాణ్ అలా ఎందుకు మాట్లాడారో!?

ఈ మొత్తం వివాదంపై నిర్మాతగా.. బాలయ్యకు అత్యంత ఆప్తుడిగా ఉన్న సి. కళ్యాణ్ అంతా మంచిగానే మాట్లాడారు కానీ.. ఫేస్ వాల్యూ ఉన్నోళ్లే ఇంపార్టెంట్ అని వ్యాఖ్యానించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో ఈ వ్యవహారం మరింత అగ్గి రాజేసినట్లుగా అయ్యింది. అంటే బాలయ్యకు ఫేస్ వాల్యూ లేదనేది ఆయన ఉద్దేశ్యమా..? లేకుంటే మరేంటి..? అనేది మరో చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎవరివల్ల పనవుతుందో వారిని మాత్రమే తీసుకెళ్తామని చిరు వల్ల అవుతుందనే ఆయనకు బాధ్యతలు అప్పగించామనడం కూడా ఎంతవరకు సబబో. అంటే బాలయ్య వల్ల ఏమీ కాదనేనా..? ఈ వ్యాఖ్యల వెనుక అర్థం. అంతటితో ఆగని ఆయన బాలయ్యకు తాను అన్నీ చెప్పానని అనడం.. ఆ తర్వాత బాలయ్యను పిలవకపోవడం ‘మా’దే బాధ్యత అనడం.. చిరు ఇంట్లో భేటీకి తలసానికే బాధ్యత వహించారని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. అంటే ఇక్కడ తప్పు.. అటు ‘మా’ది.. ఇటు తలసానిదేనని అర్థమా..? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు.. నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్‌ లాంటి వ్యక్తి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చలకు బాలకృష్ణను పిలవకపోవడం దురదృష్టకరం అనడమేంటి..? అంటే ఇండస్ట్రీలోనే రెండు వర్గాలుగా విడిపోయారని దీన్ని బట్టి అర్థమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. బాలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఒకింత సీరియస్ వార్నింగ్ ఇచ్చినంతగా మాట్లాడేశారు.

ఎప్పట్నుంచో విబేధాలు..!?

వాస్తవానికి టాలీవుడ్‌లో ఎప్పట్నుంచో విబేధాలున్నాయ్. ‘మా’ డైరీ రిలీజ్ రోజున సీనియర్ నటుడు రాజశేఖర్ వర్సెస్ సినీ ఇండస్ట్రీగా పరిస్థితులు మారిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వ్యవహారం టాలీవుడ్‌ను షేక్ చేసింది. ఎలాగో పెద్దల జోక్యంతో పరిస్థితులు సద్దుమణిగాయ్. ఇక బాలయ్య.. చిరు విషయానికొస్తే.. ఈ ఇద్దరూ పైకి బాగానే ఉన్నా ఒకరంటే ఒకరికి అస్సలు పడదన్నది జగమెరిగిన సత్యమే. ఈ విషయంలో పలుమార్లు బాలయ్య మాటలు, నాగబాబు మాటలతో నిరూపితమైంది కూడా. ఇలా అన్ని విషయాలను మనసులో పెట్టుకున్న బాలయ్య ఒక్కసారిగా ఎన్టీఆర్ ఘాట్ వేదికగా ఓపెన్ అయ్యారని కొందరు అంటున్నారు. మరికొందరైతే చిరంజీవి పెద్దన్న పాత్ర పోషించడం బాలయ్యకు రుచించలేదేమో..? అందుకే ఇలా ఇండైరెక్టుగా మాట్లాడారని కూడా చెవులు కొరుకుంటున్నారట. మొత్తానికి చూస్తే.. చిరు వర్సెస్ బాలయ్యగా పరిస్థితులు మారిపోయాయ్.

భూములు, రియల్ ఎస్టేట్ పంచాయితీ ఏంటి..!?

బాలయ్య అన్నట్లుగా భూములు పంచుకోవడమేంటి..? అమ్ముకోవడమేంటి..? అసలు రియల్ ఎస్టేట్ చేయడానికి ఇదేమైనా కరోనా కాలమా..? లేదా పట్టలేని ఆనందంతో పగలబడి నవ్వే కాలమా..? అనేది ఇక్కడ చర్చించాల్సిన అవసరముంది. పైగా బాలయ్య అలా అంటున్నారు కాబట్టి ఒకవేళ ఆయన మాటలే నిజం అనుకుంటే ఒకరిద్దరు కూర్చోని ఇలాంటి విషయాలు సీక్రెట్‌గా మాట్లాడుకుంటారు కానీ.. అంతమంది నిర్మాతలు, దర్శకులు, హీరోల మధ్యలో ఎందుకు మాట్లాడుకుంటారు..?. ఒకవేళ ఇదే నిజమైతే బాలయ్య దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా..? ఒకవేళ ఉంటే బయటపెడితే మీరే కింగ్ అవుతారు కదా..? మరి అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు ఎందుకనీ.. అంటే దీన్ని బట్టి చూస్తే ఏదో రాయేసేద్దాం.. తగిలితే సరే లేకుంటే లీవ్ ఇట్ అన్నది బాలయ్య ఉద్దేశమా అంటూ కొందరు సినీ పెద్దలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని టాక్ నడుస్తోంది.

ఇకనైనా..!?

ఈ మొత్తమ్మీద చూస్తే.. ఎవరు ఎవరితో భేటీ అయినా సీఎంను కలిసినా ఫైనల్ షూటింగ్స్‌కు అయితే అనుమతి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక చిరంజీవే కర్త, కర్మ క్రియగా ఉన్నారు.. నాడు సీసీసీ ఏర్పాటు మొదలుకుని సీఎం కేసీఆర్‌ను కలిసే వరకూ అన్నీ చిరు సమక్షంలోనే జరిగాయ్. ఇవన్నీ ఊరికే చేశామంటే చేశామన్నట్లుగా కాకుండా ఫైనల్‌గా ఫలితం వచ్చింది కూడా. మరి అలాంటిది మెచ్చుకోవాల్సింది పోయి ఇలా నోరు పారేసుకోవడం వల్ల ఏమైనా ఒరుగుతుందా..? అనే ప్రశ్నకు బాలయ్య నుంచి సమాధానం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ బాలయ్య ఆరోపణలు నిజమే అనుకుంటే ఆధారాలు బయటపెట్టాల్సిన అవసరం అంతకుమించి ఉంది. మరి ఇకనైనా కలిసికట్టుగా ఒక్క థాటిపై ముందుకెళ్తారో..? ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే పోతారో..? వేచి చూడాల్సిందే. వివాదం ముదిరితే మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహకందట్లేదు. సర్దిచెప్పుకుని ముందుకెళ్తే తప్ప పరిస్థితులు అనుకూలించవ్ అనేది గుర్తించుకోవాలి మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.