close
Choose your channels

యువతకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్

Thursday, January 28, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువతకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్

బీజేపీ, జనసేన కీలక నేతలు నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్రంలో మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై, పంచాయతీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. జనసేన పక్షాన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు శ్రీ కందుల దుర్గేష్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ,పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్ర గవర్నర్‌ని కలిసి పరిస్థితులను వివరించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.."రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులను గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. గతంలో నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా చూడాలని గవర్నర్ గారిని కోరాం. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సహకాలు ఇవ్వడం సహజమే. దాన్ని మేము ఆహ్వానిస్తాం. అయితే ప్రభుత్వం ప్రలోభపెట్టి, భయపెట్టి ఏకగ్రీవాలు చేసే విధంగా కుట్ర పన్నుతున్నట్టు కనబడుతోంది. ఇటీవల మంత్రులు, ప్రభుత్వ పెద్దలు జారీ చేసిన ప్రకటనలు, ఇచ్చిన స్టేట్ మెంట్లను గవర్నర్ గారి వద్ద ప్రస్తావించాం. అందుకు సంబంధించిన కాపీలు కూడా అందచేశాం. ఆన్ లైన్ లో నామినేషన్ స్వీకరించే ప్రక్రియ తీసుకురావాలన్న విషయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్లాం.భారతీయ జనతా పార్టీ, జనసేన కలసి ఈ ఎన్నికల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. ఈసారి యువత ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికల ప్రక్రియను ఓ పండుగలా ముందుకు తీసుకువెళ్లాలి. ప్రభుత్వ దౌర్జన్యాలకు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అహంకారంతో చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు కోరిన విధంగా యువతను పెద్ద ఎత్తున బరిలోకి దింపే విధంగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని..

కుల ధ్రువీకరణ పత్రాలు, బకాయిలకు సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ విధమైన కుట్రలను ప్రతి ఒక్కరు ఖండించాలి. అధికార యంత్రాంగం, ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు ఎన్నికల కమిషన్ కి సహకరించాలి.

గవర్నర్ దృష్టికి ఛలో అసెంబ్లీ అంశం

నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి సరైన రీతిలో పరిహారం అందలేదన్న విషయాన్ని కూడా గవర్నర్ గారికి వివరించాం. పెట్టుబడి కూడా దక్కకపోగా అప్పుల పాలైన రైతులని ఆదుకోవాలని సహేతుకమైన పరిహారం కోసం డిమాండ్ చేసినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చిన విషయాన్ని పవన్ కల్యాణ్ గారు గవర్నర్ గారికి తెలియచేయమన్నారు. ఆ వివరాలను సవివరంగా గవర్నర్ గారి ముందు ఉంచాం" అని నాదెండ్ల మనోహర్ తెలిపారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.