close
Choose your channels

బాబు దీక్ష రోజే ఝలక్.. దేవినేని రాజీనామా.. వైసీపీలోకి!

Thursday, November 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాబు దీక్ష రోజే ఝలక్.. దేవినేని రాజీనామా.. వైసీపీలోకి!

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన దీక్షకు దిగిన రోజే విజయవాడకు చెందిన ముఖ్యనేత, యువనేత ఝలక్ ఇచ్చారు. తెలుగుదేశంలో యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవినేని అవినాశ్ పార్టీ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేసేశారు. రాజీనామా చేసిన వారిలో కడియాల బచ్చిబాబు కూడా ఉన్నారు. వాస్తవానికి ఈయన రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే వాటన్నింటినీ కొట్టేసిన దేవినేని ఇటీవలే మీడియా ముందుకు వచ్చి క్లారిటీ కూడా ఇచ్చారు.

అసలేం జరిగింది!?

అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ.. బుధవారం రాత్రి దేవినేని అభిమానులు, అనుచరులు, ఆప్తులతో అవినాష్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో కార్యకర్తలు టీడీపీలో ఉండొద్దని.. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఇవ్వట్లేదని పదేపదే చెప్పడం.. పార్టీ మారి తీరాల్సిందేనని ఒత్తిడి తీసుకురావడంతో చేసేదేమీ లేక అవినాష్ గురువారం నాడు రాజీనామా చేసేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లభించడంలేదన్న అసంతృప్తి అవినాష్‌కు ఉంది. అందుకే భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అనుచరులతో సమావేశం అవ్వగా రాజీనామా చేయాలని పట్టుబట్టి మరీ చేయించారు.

నేడు వైసీపీలోకి..!

ఇదిలా ఉంటే.. దేవినేని అవినాష్ ఇవాళ అనగా గురువారం సాయంత్రం 4 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్న రోజే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెబుతారని సమాచారం. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి బొప్పన భవకుమార్ పోటీ చేయగా ఓడిపోయారు. అయితే టీడీపీ నుంచి పోటీ చేసిన గద్దె రామ్మోహన్ 15,164 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మరింత పట్టుపెంచుకునేందుకు యువనేత కావాలని భావించిన వైసీపీకి సరైన సమయంలో అవినాష్ రాజీనామా కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దేవినేని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదీ..!

అయితే దేవినేని అవినాష్ రాజీనామా టీడీపీకీ భారీ ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాలో అంతంత మాత్రమే ఉన్న టీడీపీకి పూర్తిగా కోల్పోయినట్లవుతుంది. కాగా దేవినేని కుటుంబం ఆది నుంచి టీడీపీతో మంచి సంబంధాలు కలిగి ఉంది. టీడీపీ స్థాపించినప్పుడు ఎన్టీఆర్‌కు విధేయుడిగా.. చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తుల్లో దేవినేని నెహ్రూ ఒకరు. ఎన్టీఆర్ కేబినెట్‌లో నెహ్రూ మంత్రిగా కూడా పనిచేశారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 1995 ఎపిసోడ్ త‌రువాత టీడీపీకి టాటా చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2017 వరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఆ తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. టీడీపీలో చేరిన అతి కొద్దికాలంలోనే (2017 ఏప్రిల్ 17న) నెహ్రూ అనారోగ్యంతో మృతి చెందారు.

తండ్రి మరణం తర్వాత ‘కీ’!

తండ్రి మరణాంతరం కుమారుడు అవినాష్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అవినాష్ దమ్మును గుర్తించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు వరుసగా రెండుసార్లు తెలుగు యువత అధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గం అయిన గుడివాడ నుంచి టీడీపీ తరఫున అవినాష్‌ను బరిలోకి దింపారు. అయితే నానిపై 19వేలకు పైలుకు ఓట్లతో అవినాష్ ఓటమిపాలయ్యారు. అయితే సామాజిక వర్గం బాగా కలిసొస్తుందని కచ్చితంగా దేవినేనే గెలుస్తారని అందరూ అనుకున్నారు.. అయితే ఓటమెరగని నేతగా పేరుగాంచిన నానీ గెలిచి ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.