close
Choose your channels

sajjala rama krishna reddy: మీ ‘‘బ్రోకర్’’ బాగోతం మొత్తం తెలుసు.. పవన్ జోలికొచ్చారో : సజ్జలకు పోతిన మహేశ్ వార్నింగ్

Thursday, June 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సకల శాఖల నుంచి పర్సంటేజీ వసూలు చేసే ప్రధాన బ్రోకర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సాధారణ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి వందల కోట్లు ఎలా పోగు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని మహేశ్ డిమాండ్ చేశారు. బ్రోకర్ సినిమాలో ఆర్పీ పట్నాయక్ రోల్ తరహాలో సజ్జల చెలరేగిపోతున్నారని.. ఇన్ని తప్పుడు పనులు చేయడంతోనే బీజేపీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పడానికి కూడా సజ్జల భయపడుతున్నారని చురకలు వేశారు. కోనసీమ అల్లర్ల ఘటనలో ప్రధాన నిందితుడు మీతో ఫోటోలు దిగితే దానికి సమాధానం ఎందుకు చెప్పలేదని పోతిన మహేశ్ ప్రశ్నించారు. మీ బ్రోకర్ పనులను ప్రజలంతా గమనిస్తున్నారని.. వారు ఇక ఉపేక్షించరని ఆయన హెచ్చరించారు.

ఇసుక... మద్యంలోనూ పర్సెంటేజీలే:

ఇసుక రవాణా, నిర్వహణను జేపీ వెంచర్స్ సంస్థకు కట్టబెట్టి, ఏక మొత్తంలో వందల కోట్లు దండుకున్నారని పోతిన మహేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో రకరకాల మద్యం బ్రాండ్లను దింపి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ వివిధ డిస్టలరీల నుంచి వందల కోట్లు పిండుకుంటున్నారని ఆయన విమర్శించారు. మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి వందల కోట్లు సంపాదిస్తున్నారని... గుడివాడ క్యాసినో అంశంలోనూ మాజీ మంత్రి కొడాలి నాని దగ్గర నుంచి భారీ మొత్తంలో లాక్కున్నారని మహేశ్ ఆరోపించారు. భయపెట్టి, బెదిరించి ఎంత మంది దగ్గర ఇలా దోపిడీ చేస్తారు.. దీనిపై జనసేన పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తుందని ఆయన హెచ్చరించారు.

ప్రేక్షకులపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదా:

సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తే పేదవాడికి వినోదం అందుతుంది అన్నట్లు చెప్పారంటూ మహేశ్ సెటైర్లు వేశారు. ప్రేక్షకుల మీద ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదా? వారికి రీ కౌంటింగ్ ఫీజు 500 రూపాయలు పెట్టడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. రెండు లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారో సమీక్ష లేదంటూ దుయ్యబట్టారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెట్టి, వారిని ఇష్టారీతిన బదిలీ చేసి వేధించింది ప్రభుత్వమేనని మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లే విద్యా వ్యవస్థలో లోపాలు ఏర్పడ్డాయని... దానిని రాష్ట్ర ప్రధాన సలహాదారుగా సరిచేయడానికి సలహాలు ఇవ్వాల్సిన సజ్జలకు దాని గురించి ఏ మాత్రం పట్టదంటూ దుయ్యబట్టారు. తన కుటుంబ వస్త్ర వ్యాపారం కోసం ప్రభుత్వరంగ సంస్థ ఆప్కోని నిర్వీర్యం చేయడానికి సజ్జల చేస్తున్న ప్రయత్నాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెడతామని పోతిన మహేశ్ హెచ్చరించారు. మరోసారి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.