close
Choose your channels

అపోహలు సృష్టించి పోలింగ్ శాతం తగ్గేలా చూశారు: కిషన్‌రెడ్డి

Wednesday, December 2, 2020 • తెలుగు Comments

అపోహలు సృష్టించి పోలింగ్ శాతం తగ్గేలా చూశారు: కిషన్‌రెడ్డి

ఓటింగ్ శాతం తగ్గినందుకు టీఆర్ఎస్ సిగ్గుతో తలదించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం తన స్వార్థం కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. తాము గెలవకున్నా పర్వాలేదు కానీ మరో పార్టీ గెలవొద్దనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పోలింగ్ తగ్గడానికి కారణమెవరో మేథావులు ఆలోచించాలని కిషన్‌రెడ్డి కోరారు.

కావాలనే ఎన్నికలను హడావుడిగా ప్రభుత్వం నిర్వహించిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అపోహలు సృష్టించి పోలింగ్ శాతం తగ్గేలా చూశారన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం, ఈసీ కుమ్మక్కైందన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఏకే 47 గన్ చాటున జరిగిన ఎన్నికల్లో 54 శాతం పైగా పోలింగ్ జరిగిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కుట్రలు చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని టీఆర్ఎస్ చూసిందన్నారు. అయితే పోలింగ్ సరళి చూశాక మాత్రం తామే గెలుస్తామన్న విశ్వాసం కలిగిందన్నారు.

బీజేపీ కార్యకర్తలు చాలా బాగా పని చేశారని.. అన్యాయం జరిగినప్పుడు పులి బిడ్డలా పోరాడారని కిషన్‌రెడ్డి ప్రశంసించారు. మంత్రులు స్వయంగా వచ్చి డబ్బులు పంచారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి తమ కార్యకర్తల మీద విశ్వాసం లేక స్థానికేతర నాయకులతో డబ్బుల పంపిణీకి పాల్పడ్డారన్నారు. లారీల కొద్దీ మద్యం పంపిణీ చేశారన్నారు. స్వయంగా మంత్రుల పర్యవేక్షణలో మద్యం పంపిణీ జరిగిందన్నారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రే స్వయంగా విద్వేషాలు చెలరేగుతాయని చెప్పడంతో ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఉపాధ్యాయులు లేకుండా ఏ ఎన్నికలూ జరగలేదని కిషన్‌రెడ్డి తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz