close
Choose your channels

Rangasthalam Review

Review by IndiaGlitz [ Friday, March 30, 2018 • తెలుగు ]
Rangasthalam Review
Banner:
Mythri Movie Makers
Cast:
Ram Charan, Samantha, Aadhi Pinishetty, Jagapathi Babu, Prakash Raj, Amit Sharma, Naresh, Rohini, Brahmaji, Gauthami, Rajesh Diwakar and Pooja Hegde
Direction:
Sukumar
Production:
Naveen Yerneni,Y. Ravi Shankar, Mohan Cherukuri
Music:
Devi Sri Prasad

Rangasthalam Telugu Movie Review

చిరుత నుండి  ధృవ వర‌కు ప‌రిశీలిస్తే మ‌గ‌ధీర మిన‌హా రామ్‌చ‌ర‌ణ్ స్టైలిష్‌, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే చేస్తూ వ‌చ్చాడు. ఇకఆర్య నుండి నాన్న‌కు ప్రేమ‌తో వ‌ర‌కు చూస్తే  డైరెక్ట‌ర్ సుకుమార్ స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే చేస్తూ వ‌చ్చారు. మ‌రి వీరిద్ద‌రి కాంబోలో సినిమా అంటే ఎలాంటి స్టైలిష్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా వ‌స్తుందో క‌దా అనుకుంటాం. మెగాభిమానులు.. సినీ ప్రేక్ష‌కులు అలాగే భావించారు. అయితే ఇద్ద‌రూ భిన్నంగా 1980 బ్యాక్‌డ్రాప్ గ్రామ రాజ‌కీయాలు.. అప్ప‌టి ప‌రిస్థితులు, ఎమోష‌న్స్ తో సినిమా చేస్తార‌ని తెలిసి ఆశ‌ర్యం అనిపించింది. ఏదో 1980 అంటే ఏదో చేశామంటే చేశామ‌ని కాకుండా అప్ప‌టి ప‌రిస్థితుల‌, వాతావ‌ర‌ణాన్ని తెలియ‌జేసేలా సెట్స్‌ను క్రియేట్ చేసేసుకున్నారు. `రంగ‌స్థ‌లం` అనే టైటిల్ అనౌన్స్ మెంట్ నుండి మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. రామ్‌ఛ‌ర‌ణ్ ర‌గ్‌డ్ లుక్‌.. స‌మంత‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబు ఇలా అన్ని కార్య‌క్టేర్స్ సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిని పెంచేశాయి. మ‌రి ఈ ఆస‌క్తిని `రంగ‌స్థ‌లం నిలుపుకుందా?  లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

చిట్టిబాబు(రామ్‌చ‌ర‌ణ్‌)కి పాక్షికంగా చెవులు విన‌ప‌డ‌వు. రంగ‌మ్మ‌త్త‌(అన‌సూయ‌) వ‌ద్ద ఉండే ఇంజ‌న్‌తో త‌న ఊరు రంగ‌స్థ‌లంలోని పంట పొలాల‌ను నీటితో త‌డి చేస్తుంటాడు. ఊర్లో ఉండే రామ‌ల‌క్ష్మి(స‌మంత‌)తో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఫ‌ణీంద్ర భూప‌తి(జ‌గ‌ప‌తిబాబు) ముప్పై ఏళ్లుగా రంగ‌స్థ‌లం ఊరి ప్రెసిడెంట్‌గా రాజ్య‌మేలుతుంటాడు. సొసైటీ మ‌నుషులు (అజ‌య్ ఘోష్‌, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు)తో అన్యాయాల‌కు పాల్ప‌డుతుంటాడు. త‌క్కువ మొత్తంలో అప్పులిచ్చి పేద ప్ర‌జ‌ల పంట‌ల‌ను, భూముల్ని లాక్కుంటూ ఉంటాడు. ఎదురుతిరిగిన వారిని చంపేస్తుంటాడు. అదే స‌మ‌యంలో చిట్టిబాబు అన్న‌య్య కుమార్ బాబు(ఆది పినిశెట్టి) దుబాయ్‌నుండి వ‌స్తాడు. ప్రెసిడెంట్, సొసైటీవారు చేస్తున్న అన్యాయాల‌కు కుమార్‌బాబు, చిట్టిబాబు ఎదురు తిరుగుతారు. వీరికి మ‌రో పార్టీ నేత ద‌క్షిణామూర్తి(ప్ర‌కాశ్ రాజ్) సపోర్ట్ చేస్తాడు. చిట్టిబాబు త‌న అన్న‌య్య‌ను ఎవ‌రూ ఏమీ అన‌కుండా కాపాడుకుంటూ ఉంటాడు. చిట్టిబాబు లేని స‌మ‌యంలో కొంద‌రు కుమార్‌బాబుని చంపేస్తారు. అస‌లు వాళ్లు కుమార్‌బాబుని ఎందుకు చంపారు?  ప్రెసిడెంట్ ప‌దవి కోస‌మే చంపారా?  లేక మ‌రి దేనికైనానా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

సినిమాకు ప్ర‌ధాన బ‌లం రామ్‌ఛ‌ర‌ణ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు (మ‌గ‌ధీర మిన‌హా) ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూ వ‌చ్చిన చెర్రీ.. త‌న ఇమేజ్‌కు భిన్నంగా చేసిన సినిమా `రంగ‌స్థ‌లం`. గుబురు గ‌డ్డం సినిమా ఆసాంతం లుంగీలోనే (క్లైమాక్స్ మిన‌హా) క‌న‌ప‌డ్డాడు చ‌ర‌ణ్‌. ఓ స్టార్ హీరో చెవుడు ఉన్న వ్య‌క్తిగా న‌టించ‌డానికి ఒప్పుకున్నాడంటే క‌థ‌పై, క్యారెక్ట‌ర్‌పై, ద‌ర్శకుడిపై త‌న‌కున్న న‌మ్మ‌క‌మే కార‌ణం. ద‌ర్శ‌కుడిని సింపుల్‌గా ఫాలో అయిపోయాడు. త‌న సంభాష‌ణ‌లు చెప్పిన తీరు. త‌న చెవుడుని క‌వ‌ర్ చేసుకునేందుకు ప‌డే తిప్ప‌లు అన్నీ ప్రేక్ష‌కుడికి న‌వ్వుని తెప్పిస్తాయి. ఇక స‌మంత ప‌ల్లెటూరి అమ్మాయిగా చ‌క్క‌గా నటించింది. ఆదిపినిశెట్టి డీసెంట్ రోల్‌లో క‌నిపించాడు. రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో అన‌సూయ పాత్ర చ‌క్క‌గా ఉంది.  విల‌న్‌గా చేసిన జ‌గ‌ప‌తిబాబు.. ప్రెసిడెంట్ పాత్ర‌ను చాలా సుల‌భంగానే క్యారీ చేసేశాడు. అజ‌య్ ఘోశ్‌, ప్ర‌కాశ్ రాజ్, సీనియ‌ర్ న‌రేశ్‌, రోహిణి ఇలా అంద‌రి న‌ట‌న ప్రేక్ష‌కుడ్ని మెప్పిస్తుంది. ఎవ‌రి పాత్ర‌ల్లో వారు చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఇక ద‌ర్శ‌కుడు సుకుమార్ క్యారెక్ట‌ర్స్‌ను డిజైన్ చేసుకున్న తీరు.. సంభాష‌ణ‌లు ప‌లికించిన విధానం.. స‌న్నివేశాల‌ను మ‌లిచిన తీరు చ‌క్క‌గా ఉన్నాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో `యేరు శెన‌గ మీద‌... `, `రంగ‌మ్మ మంగ‌మ్మ‌.. ` జిగేల్ రాణి`, `ఆ గ‌ట్టునుంటావా ఈ గ‌ట్టుకొస్తావా..` పాట‌లు విన‌డానికి కాదు.. అవి తెర‌కెక్కించిన తీరు కూడా ఆక‌ట్టుకుంటాయి. ఇక నేప‌థ్య సంగీతం సూప‌ర్బ్‌. ర‌త్న‌వేలు త‌న దైన సిన‌పిమాటోగ్ర‌ఫీతో సినిమాకు కొత్త క‌ల‌ర్‌ను తీసుకొచ్చాడు. ఇక ఆర్ట్ డైరెక్ట‌ర్స్ రామ‌కృష్ణ‌, మోనిక‌లు వేసిన సెట్స్‌, కాస్ట్యూమ్స్ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి.

మైన‌స్ పాయింట్స్‌:

సినిమా మూడు గంట‌ల నిడివితో ఉండ‌టం..స‌రే నిడివే క‌దా! అనుకుంటే.. దాన్ని స్లోనెరేష‌న్‌లో సాగ‌దీత‌గా చూపించిన తీరు ప్రేక్ష‌కుడికి న‌చ్చ‌దు. అలాగే లాజిక్ లేని స‌న్నివేశాలు, ఎడిటింగ్‌లో సినిమాను కాస్త త‌గ్గిస్తే బావుండేద‌నిపించింది.

స‌మీక్ష‌:

రంగ‌స్థ‌లం సినిమా పరంగా ముఖ్యంగా అభినందించాల్సిన వ్య‌క్తుల్లో రామ్‌చ‌ర‌ణ్ ముందుంటాడు. స్టార్ హీరో అయిన చెవిటి వాడి క్యారెక్ట‌ర్‌ను చేయ‌డానికి అంగీక‌రించ‌డం. ఇక సుకుమార్ త‌ను చెప్పాల‌నుకున్న క‌థ‌ను 1980 బ్యాక్‌డ్రాప్‌లో చెప్పాల‌నుకోవ‌డం మంచి ప‌రిణామం. గుడిసెలు, అరుగులు అవ‌న్నీ 1980 జ‌న‌రేష‌న్‌కు గుర్తుకొస్తాయి. రామ్‌ఛ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసిన తీరు. ఇక నిర్మాత‌లను త‌ప్ప‌కుండా అభినందించాలి. చ‌ర‌ణ్‌, సుకుమార్ వంటి  కాస్టింగ్‌.. మంచి టెక్నీషియ‌న్స్  ఉన్నా కూడా.. ఇలాంటి ఓ సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చినందుకు. మేకింగ్ ఎక్క‌డా కాంప్రమైజ్ కానందుకు. ఓపెనింగ్ సీన్‌కు.. ఎండింగ్ సీన్‌కు ముడిపెట్టిన విధానం బావుంది. అన్న‌య్య అంటే ప్రేమ చూపించే తమ్ముడు. కుటుంబ వ్య‌వ‌స్థ‌ను సైడ్ ఎడ్జ్‌లో సుకుమార్ ట‌చ్ చేసిన విధానం మెచ్చుకోలుగా ఉంది. సినిమాలో ప్ర‌త్యేక‌మైన కామెడీ క‌న‌ప‌డ‌దు. పాత్ర‌ల డిజైనింగ్‌.. స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌తోనే కామెడీ జ‌న‌రేట్ అయ్యింది. ముఖ్యంగా త‌న ప్రేమ‌ను స‌మంత‌కు చెప్పాల‌నుకోవ‌డం. ఆమె చెప్పేది విన‌ప‌డ‌క‌పోవ‌డం వంటి సన్నివేశాల్లో వ‌చ్చిన కామెడీ ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తుంది. అప్ప‌ట్లో రాజ‌కీయాలు.. కుల వ్య‌వ‌స్థ‌లు ఎలా ఉండేదో కూడా సినిమా ప్ర‌తిబింబించారు. జ‌గ‌ప‌తి బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆది, చెర్రీలు అత‌నికి అత‌ని పేరుని గుర్తు చేయ‌డం.. క్లైమాక్స్‌లో కుమార్‌బాబు మ‌ర్డ‌ర్ రివీలింగ్‌.. స‌ద‌రు స‌న్నివేశాల్లో చెర్రీ న‌ట‌న బావుంది. యాక్ష‌న్ సీన్స్‌లో చంపుకోవ‌డం.. చంపే సన్నివేశాల్లో రా నెస్ తెలుగు ప్రేక్ష‌కుడికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే హీరో తంతే విల‌న్ 20-30 అడుగులు ఎగిరి ప‌డేలాంటి ఓవ‌ర్ డోస్ యాక్ష‌న్ సీన్స్ క‌న‌ప‌డ‌వు. రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా యాక్ష‌న్ సీన్స్‌ను కంపోజ్ చేశారు. కొన్ని సీన్స్‌లో త‌మిళ వాస‌న కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డింది.

బోటమ్ లైన్‌: 'రంగ‌స్థ‌లం'.. కొత్త ప్ర‌య‌త్నం... చర‌ణ్ కెరీర్‌లో ది బెస్ట్

Rangasthalam Movie Review in English‌

 

Rating: 3.25 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE