close
Choose your channels

Jamuna : టాలీవుడ్‌లో మరో విషాదం.. అలనాటి నటి జమున కన్నుమూత

Friday, January 27, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గతేడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి దిగ్గజాలను కోల్పోయి శోకసంద్రంలో మునగిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఏడాదిలో మరో షాక్ తగిలింది. అలనాటి నటి జమున ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. జమున వయసు 86 సంవత్సరాలు. తెలుగు , తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. జమున మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భౌతికకాయాన్ని కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకురానున్నారు.

ఇదీ జమున ప్రస్థానం:

1936 ఆగస్టు 30 కర్ణాటకలోని హంపీలో నిప్పణీ శ్రీనివాసరావు, కౌసల్యా దేవి దంపతులకు జమున జన్మించారు. ఆమె అసలు పేరు జానాభాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జమున బాల్యం గడిచింది. తల్లి దగ్గరే సంగీతం, హర్మోనియం నేర్చుకున్నారు. చిన్న తనంలోనే ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఖిల్జీరాజుపతనం అనే నాటకంలోని ఓ పాత్రకు సీనియర్ నటుడు జగ్గయ్య ఆమెను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే మా భూమి నాటకంలో జమున నటనను చూసిన డాక్టర్ గరికిపాటి రాజారావు ఆమెకు ‘‘పుట్టిల్లు’’లో అవకాశం ఇచ్చారు. అప్పుడు జమున వయసు 15 సంవత్సరాలు. అయితే దిగ్గజ దర్శకుడు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘మిస్సమ్మ’’త ఆమెకు తొలి బ్రేక్ వచ్చింది.

తెలుగు వారి సత్యభామ :

ఆ తర్వాత జమున వెనుదిరిగి చూసుకోలేదు. అందం, అభినయం మెండుగా వుండటంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. అల్లరిపిల్ల, గడుసైన పాత్రలకు జమున కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ముఖ్యంగా తెలుగు వారి గుండెల్లో సత్యభామగా ఆమె చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి మహానటులతో నటించారు. పండంటి కాపురం, గుండమ్మ కథ, మిస్సమ్మ, దొంగ రాముడు, గులేబకావళి కథ, మూగ మనసులు, శ్రీకృష్ణ తులాభారం వంటి సినిమాలతో ఆమె మంచి పేరు వచ్చింది. జమునను ఫిల్మ్‌ఫేర్ సహా తమిళనాడు స్టేట్ అవార్డ్, ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, బి సరోజినీ దేవి అవార్డ్‌లు వరించాయి. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జూలురి రమణారావును ఆమె వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె . 2014లో రమణారావు కన్నుమూశారు.

రాజకీయాల్లోనూ సత్తా చాటిన జమున :

చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న జమున. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. రాజమండ్రి నుంచి 1989లో కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే రెండేళ్లకే 1991లో జరిగిన ఎన్నికల్లో జమున పరాజయం పాలయ్యారు. ఈ తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పించుకున్న జమున.. తదనంతర కాలంలో వాజ్‌పేయ్‌ హయాంలో బీజేపీకి మద్ధతుగా నిలిచారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.