close
Choose your channels

వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు

Wednesday, February 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ షర్మిలపై  తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల పార్టీ ప్రారంభించినప్పటి నుంచి మంత్రి గంగుల కమలాకర్ ఆమెపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఆమెను ఏదో ఒక విధంగా.. ఒకరకంగా చెప్పాలంటే సందర్భం క్రియేట్ చేసుకుని మరీ విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండు సార్లు షర్మిలపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన గంగుల కమలాకర్ తాజాగా మరోసారి విమర్శించారు. మళ్లీ ఆంధ్రా శక్తులు తెలంగాణలో పురి విప్పుతున్నాయంటూ గంగుల విమర్శించారు. ఇవాళ జగనన్న బాణం వచ్చిందని.. రేపు జగనన్నే దిగుతాడు అని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక బాణం వేస్తే తాము కోటి బాణాలు వేస్తామంటూ నేడు గంగుల విమర్శించారు.

‘‘సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో మనకు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ సీఎం అయి ఆరేళ్లైనా గడిచిందో లేదో.. మళ్లీ ఆంధ్రా శక్తులు పురివిప్పుతున్నాయి. వాళ్లు 70 ఏళ్లు పాలించి, మనను అన్ని రకాలుగా వంచించారు. ఇప్పుడు మనకు నీళ్లు, కరెంటు వచ్చే సరికి వాళ్ల కడుపుల్లో మంట మొదలైంది. జగనన్న బాణాన్ని అంటూ షర్మిలక్క ఎంట్రీ ఇస్తున్నది ఎందు కోసం? మన నీళ్లు, కరెంటును దోచుకుపోవడానికి కాదా? ఇవాళ జగనన్న బాణం షర్మిల వచ్చింది. రేపు జగనన్నే దిగుతాడు. ఆ వెంటనే చంద్రబాబు కూడా వచ్చేస్తాడు. ఇంకేముంది.. తెలంగాణలో మళ్లీ కొట్టాటలు మొదలవుతాయి’’ అని మంగళవారం ఒక ప్రెస్‌మీట్‌లో గంగుల కమలాకర్ విమర్శించారు.

తాజాగా నేడు ‘జగనన్న తెలంగాణలో ఒక బాణం వేస్తే మేము కోటి బాణాలు వేస్తాం. ప్రత్యేక రాష్ట్రం కోసం రాయల సీమవాసులు పోరాడుతున్నారు. కావాలంటే అక్కడికి వెళ్లి షర్మిల పార్టీ పెట్టాలి. కేసీఆర్‌ను కాపాడుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు’’ అని గంగుల పేర్కొన్నారు. అసలు ఎందుకు గంగుల ఇలా అడపా దడపా షర్మిలపై బాణాలు ఎక్కు పెడుతున్నారనేది అర్థం కాకుండా ఉంది. సీఎం కేసీఆర్ స్ట్రాటజీ ప్రకారం ఆయన నడుచుకుంటున్నారా? లేదంటే షర్మిల వస్తే రెడ్డి సామాజిక వర్గం ఓట్లన్నీ చేజారిపోతాయనా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆయన నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువని.. అవన్నీ చేజారిపోతే తనకు మున్ముందు కష్టమని భావించి ముందస్తుగా గంగుల కమలాకర్.. షర్మిలను ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. మొత్తానికి గంగుల వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం షర్మిల పార్టీ పెట్టడం వల్ల తమకేదో నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నట్టు కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.