close
Choose your channels

Tirupati:తిరుమల కొండపై ఉగ్ర కలకలం.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ, ఏమన్నారంటే..?

Tuesday, May 2, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమల ఆలయంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లుగా వస్తున్న వార్తలతో భక్తులు ఉలిక్కిపడ్డారు. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్‌కు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో సీసీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం సులభ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఉగ్రవాదులేవరైనా కార్మికుల ముసుగులో తిరుమలకు వచ్చారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో కొండపై హై అలర్ట్ ప్రకటించారు.

ఆ ఈమెయిల్‌ ఎక్కడిది:

ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొండపై ఉగ్రవాదులెవరూ లేరని స్పష్టం చేశారు. అయితే తమకు ఈమెయిల్ వచ్చిన మాట వాస్తవమేనని ఎస్పీ అంగీకరించారు. అది ఫేక్‌గా తేలిందని, భక్తులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈమెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు పంపారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ ప్రకటనతో టీటీడీ సిబ్బంది, భక్తులు, అధికారులు ఊపిరీ పీల్చుకున్నారు.

ఏప్రిల్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే:

ఇదిలావుండగా.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే వుంది. స్వామివారి దర్శనానికి 20 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి వున్నట్లు టీటీడీ తెలిపింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం 81,183 మందిని భక్తులు దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. అలాగే నిన్న శ్రీవారి హుండీ ద్వారా రూ.3.58 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. మరోవైపు.. ఏప్రిల్ నెల మొత్తం మీద శ్రీవారికి హుండీకి రూ.114 కోట్లు ఆదాయంగా వచ్చిందని టీటీడీ తెలిపింది. ఇదే మార్చి నెలతో పోలిస్తే (రూ.120.29 కోట్లు) తక్కువ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.