ఇదేం విడ్డూరం అయ్యా.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా..
Send us your feedback to audioarticles@vaarta.com
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ప్రమాదాలు నివారించండి అని పోలీసులు తరుచూ చెబుతూ ఉంటారు. ఇదే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝూళిపిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోకపోయినా.. రాంగ్ రూట్‌లో వెళ్లినా.. కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా.. బైక్ మీద ట్రిపుల్ రైడింగ్.. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా.. సహజంగా చలానాలు విధిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు వేసే చలానాలు తీవ్ర చర్చనీయాంశమవుతూ ఉంటాయి.
ఇప్పటికే అలాంటి ఘటనలు ఎన్నో చూశాం. సైకిల్ మీద వెళ్లే వారికి.. కారులో వెళ్లే వారికి హెల్మెట్ లేదని జరిమానాలు విధించిన సందర్భాలను వింటూ ఉంటాం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ పోలీసులు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విచిత్ర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో ఓ ట్రాక్టర్ వస్తోంది. అదే సమయంలో బ్లూ కోల్ట్స్ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ ట్రాక్టర్‌ను పోలీసులు ఆపారు. ట్రాక్టర్ డ్రైవర్ నాగిరెడ్డి సీటు బెల్టు పెట్టుకోలేదంటూ రూ.1000 జరిమానా విధించారు. అయితే ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా ఎస్సై.. ఫైన్ విధించారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీని గురించి తెలుసుకోవాలని షోరూంకి కూడా ఫోన్ చేశామని.. అయితే ట్రాక్టర్‌కు సీటు బెల్ట్ అనేదే ఉండదని నిర్వాహకులు చెప్పారని తెలిపాడు. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన లేకనే ఎస్సై ఫైన్ విధించారని చెబుతున్నాడు.
ఈ విషయం వైరల్ కావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం అవగాహన లేకుండా చలానాలు ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి విచిత్ర సంఘటనే జరిగింది. సీతానాగారం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ ధరించలేదని చలానా విధించారు. అయితే నిజంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు విధించడం సరైనదే కానీ.. ఇలా ఇష్టం వచ్చినట్లు జరిమానాలు విధిస్తే రోడ్ల మీద ప్రయాణాలు ఎలా చేయాలని ప్రజలు నిలదీస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout