close
Choose your channels

CM Revanth Reddy:తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

Tuesday, May 21, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోలింగ్ హడావిడి ముగియడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లనున్నారు. ఆయన మనవడి తలనీలాలు సమర్పించేందుకు కుటుంబంతో సహా తిరుమల వెళ్లీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతికి పయనం కానున్నారు. రాత్రికి ఆయన తిరుపతిలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదిలా ఉంటే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో ఈ సమావేశం నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

ధాన్యం కొనుగోలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతులు నష్టపోకుండా చివరి ధాన్యం వరకు కొనుగోలు చేయాలని సూచించారు. సన్నవాడ సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే సీజన్‌ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇక నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌ఎస్‌డీఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా కేబినెట్‌లో చర్చించారు.

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పాలు పలువురు కాంగ్రెస్ ప్రముఖులను ఆహ్వానించాలని చర్చించారు. అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ప్రభుత్వ స్కూళ్లు నిర్వహించాలని భావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేసినా రైతులకు నీరు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే సన్నవడ్డకు మాత్రమే రూ.500బోనస్ ఇవ్వాలని నిర్ణయించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.