close
Choose your channels

స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కారు’ జోరు.. కనిపించని ‘హస్తం’!

Tuesday, June 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కారు’ జోరు.. కనిపించని ‘హస్తం’!

తెలంగాణ రాష్ట్ర వాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కారు’ ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్లగా.. ఈ జోరుకు అటు కాంగ్రెస్ ‘హస్తం’ గానీ.. ఇటు టీడీపీ ‘సైకిల్’ గానీ.. బీజేపీ ‘కమలం’ అడ్రస్ గల్లంతైంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఏడు మంది అభ్యర్థులను ఘోరంగా.. కనివినీ ఎరుగని రీతిలో ఓడించిన జనాలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బ్రహ్మరథం పట్టడంతో గులాబీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. అంతేకాదు.. పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలపడ్డ టీఆర్ఎస్.. ఇప్పుడు మాత్రం మంచి జోరు ఉందని.. ఇక అడ్డులేకుండా అదే ఓవర్ స్పీడ్‌తోనే దూసుకెళ్తుందని నేతలు చెప్పుకుంటున్నారు.

ప్రత్యర్థులు కూడా ఊహించలేకపోయారు!

ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పొంగిపోయారు.. ఆయన ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఫలితాల్లో ఇప్పటివరకు 3,556 ఎంపీటీసీ స్థానాలు, 24 జడ్పీ స్థానాలు కైవసం చేసుకుని టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుండడంపై కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో ప్రత్యర్థులు ఖాతా కూడా తెరవలేకపోయారన్నారు. మరికొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితమయ్యారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని మాతో పాటు ప్రత్యర్థులు కూడా ఊహించలేకపోయారన్నారు. ఈ తీర్పు ద్వారా మరోసారి కేసీఆరే తమ నాయకుడు అని తెలంగాణ ప్రజలు చాటిచెప్పారని కేటీఆర్ అన్నారు.

నూటికి నూరు శాతం మేమే..!

"ఇది చారిత్రక, అసాధారణ విజయం. పార్టీ ఆవిర్భవించిన 2001లోనే టీఆర్ఎస్ పరిషత్ ఎన్నికలు ఎదుర్కొంది. అప్పుడు కరీంనగర్, నిజామాబాద్ జడ్పీ పీఠాలు చేజిక్కించుకుని సత్తా చాటింది. అప్పటినుంచి ఇది ఐదో స్థానిక ఎన్నికల క్రతువు. అయితే ఈసారి మాత్రం టీఆర్ఎస్ ఎన్నడూలేనంతగా ఘనవిజయం సాధించింది. నూటికి నూరు శాతం జిల్లాలు కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మాపై ఈ స్థాయిలో ఆదరాభిమానాలు చూపించిన ప్రజలకు రుణపడి ఉంటాము. ఈ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించిన గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఎన్నిక ఏదైనా సరే, అది బ్యాలెట్ ద్వారా అయినా సరే ఈవీఎం ద్వారా అయినా సరే కేసీఆరే మా నాయకుడని మిగతా పార్టీలను ప్రజలు తిప్పికొట్టారు" అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

కుంగిపోయే తత్వం మాది కాదు!

" స్థానిక సంస్థల్లో భారీ గెలుపు మాపై మరింత బాధ్యతను పెంచింది. లోక్ సభ ఎన్నికల్లో మేము ఓడిపోయిన కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లా పరిధిలోని అన్ని జడ్పీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇంత భిన్నమైన తీర్పు ఎందుకు ఇచ్చారనే అంశంపై మేం.. కూడా విశ్లేషణ చేసుకోవాల్సి ఉంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారేమో. విజయాలకు పొంగిపోయి, పరాజయాలకు కుంగిపోయే తత్వం మాది కాదు" అని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.