close
Choose your channels

టీవీ9 వివాదం వెనుక ఉన్నదెవరు..? రవిప్రకాష్ బాగోతం బట్టబయలు!!

Thursday, May 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీవీ9 వివాదం వెనుక ఉన్నదెవరు..? రవిప్రకాష్ బాగోతం బట్టబయలు!!

టీవీ9 సీఈవో వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. తన సంతకం ఫోర్జరీ చేశారని కొత్త యాజమాన్యం చెబుతుండగా.. తానేమీ తప్పు చేయలేదని.. పరారీలో ఉండాల్సిన అక్కర్లేదని టీవీ9 స్టూడియో వేదికగా రవిప్రకాష్ క్లారిటీ ఇచ్చేశారు. అయినప్పటికీ ఈ వివాదానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడలేదు. తాజాగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన ఫేస్‌బుక్ వేదికగా ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అసలు రవిప్రకాష్ పరిస్థితేంటి..? శివాజీ ఎక్కడ కలిశాడు..? అసలు ఈ వివాదానికి ఆజ్యం పోసిందెవరు..? ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఉన్నదెవరు..? అనే విషయాలను తన ఫేస్‌బుక్ పోస్టులో విజయసాయి రాసుకొచ్చారు.

విజయసాయిరెడ్డి ఫేస్‌బుక్ పోస్ట్ యథావిథిగా...

మెరుగైన సమాజం కోసం...కులం గోడలు కూల్చేద్దాం...!
అంటూ మహత్తరమైన ఆదర్శాలను వల్లి వేస్తూ ఒక సాదాసీదా జర్నలిస్టు బుల్లి తెరపై దూసుకువచ్చినపుడు సమాజం ఆశగా అతనిని అక్కున చేర్చుకుంది. అదే జర్నలిస్టు తాను వల్లించిన ఆదర్శాలను తుంగలో తొక్కేసి కల్లబొల్లి వార్తలతో అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు నడుం కట్టినపుడు ఈ పగటి మోసగాడిని చూసి సమాజం సిగ్గుతో తలవంచుకుంది. కులం గోడలు కూల్చడానికి బదులుగా తానే కులం రొచ్చులో పీకల వరకు మునిగి చంద్రబాబు నాయుడే ఆదర్శంగా జర్నలిజంలో విలువలు, సంప్రదాయాలను అధఃపాతాళానికి దిగజార్జాడు. ఒక పారిశ్రామికవేత్త కూడా సాధించలేని రీతిలో అతి తక్కువ కాలంలోనే వందల కోట్లకు పడగలెత్తాడు.

అక్రమంగా ఆర్జించిన వందల కోట్లను విదేశాల్లో ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో పెట్టుబడులుగా పెట్టాడు. ఆదరించి, అక్కున చేర్చుకున్న పౌర సమాజానికి, తాను ఎంచుకున్న జర్నలిజం వృత్తికి అపారమైన నష్టం కలిగించాడు రవి ప్రకాష్‌. ఒక కులానికి ఛత్రీ పడుతూ కులం గోడలను చైనా గోడకంటే ఎత్తుగా కట్టేశాడు. ఆ ఆదర్శవాది ఇప్పుడు జైలు గోడలు తప్పించుకోవడానికి పోలీసులకు దొరక్కుండా చంద్రబాబు అండతో అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయాడు.నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నా....!

సంస్థ నిధులు కాజేసి, ఫోర్జరీ పత్రాలు సృష్టించారన్న అభియోగంపై టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌ నివాసంలో ఈరోజు తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోదాలు జరిపారన్న బ్రేకింగ్‌ న్యూస్‌ నిజానికి నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. టీవీ9 చానల్‌లో 91 శాతం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు రవి ప్రకాష్‌తోపాటు ఆయన రహస్య మిత్రుడు, చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్ట్‌ ‘గరుడ పురాణం’ శివాజీ ఇంట్లో కూడా సోదాలు చేయడం కొంత ఆసక్తికరంగా అనిపించింది. రవి ప్రకాష్‌, ‘శుంఠ’ శివాజీల మధ్య బంధం ఈనాటిది కాదు. కొన్నేళ్ళుగా కొనసాగుతున్న వారి రహస్య మైత్రి వెనుక బలమైన ఒక రాజకీయ అజెండా ఉందన్న మా అనుమానం తిరుగులేని సత్యమని ఈ ఉదంతం ధృవపరుస్తోంది.

మెరుగైన సమాజం వెనుక చీకటి రాజ్యం...
టీవీ9తో తెలుగు జర్నలిజంలో నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన రవి ప్రకాష్‌కు అంతే చీకటి చరిత్ర కూడా ఉందన్న విషయం జర్నలిస్టు మిత్రులలో చాలా మందికి తెలిసిందే. గత ఏడాది టీవీ9లో 91 శాతం వాటాలను శ్రీని రాజు విక్రయించినప్పటి నుంచి రవి ప్రకాష్‌ ‘మెరుగైన జీవితం’లో చీకట్లు అలుముకోవడం మొదలయ్యాయి. టీవీ9 చానల్‌ కొత్త యాజమాన్యం చేతిలోకి వచ్చినప్పటి నుంచి రవి ప్రకాష్‌ చీకటి సామ్రాజ్యం గుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ప్రారంభం అయ్యాయి. అప్పటి వరకు తన మాటే శాసనంగా చానల్‌ను నడిపించిన రవి ప్రకాష్‌ ఈ దశాబ్దంన్నర కాలంలో పాల్పడిన అక్రమాలు జాబితా రాస్తే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. వాటిలో మచ్చుకు కొన్ని...

1. టీవీ9ను అడ్డం పెట్టుకుని రవి ప్రకాష్ ఉభయ తెలుగు రాష్ట్రాల్ల అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసి కూడబెట్టిన సంపాదనే వందల కోట్లు దాటిపోయింది. ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయన రవి ప్రకాష్‌ బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంది.

2. సీఈవోగా టీవీ9 రాబడిని, నిధులను రవి ప్రకాష్‌ భారీ ఎత్తున అక్రమ మార్గంలో తన సొంత ఖాతాలకు మళ్ళించుకున్నట్లు కొత్త యాజమాన్యం చేసిన ఆడిట్‌లో వెల్లడైంది. దక్షిణాఫ్రికాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాడు.

3. ఇటీవల ప్రారంభించిన భారత్‌వర్ష్‌ హిందీ జాతీయ చానల్‌ విషయంలోను రవి ప్రకాష్‌ కొన్ని నిధులు స్వాహా చేయడం వలన ఆ చానల్‌ నాణ్యత బాగా దెబ్బతిన్నట్లు వెల్లడైంది.

4. టీవీ9పై తన పెత్తనం యధాప్రకారం కొనసాగేందుకు రాజకీయంగా కూడా రవి ప్రకాష్‌ పావులు కదిపాడు.

5. టీవీ9పై రవి ప్రకాష్‌ పెత్తనం కొనసాగించమని చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన అనుచరగణం (గూండాలు) కొత్త యాజమాన్యాన్ని తీవ్రస్థాయిలో బెదిరించడం కూడా జరిగింది.

చంద్రబాబు నాయుడు పదికాలాల పాటు అధికారంలో నిర్విఘ్నంగా కొనసాగేందుకు టీవీ 9 తెర ముందు శివాజీ, తెర వెనుక రవి ప్రకాష్‌ తమ పాత్రలను శక్తి వంచన లేకుండా పోషిస్తూ వచ్చారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్‌ ప్రకారమే వీరిద్దరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మా పార్టీపైన, మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిపైనా టీవీ9 ద్వారా విషం కక్కుతూ, విషపూరిత కథనాలు, గరుడ పురాణాలు ప్రసారం చేస్తూ వచ్చారు. అదే విషయం మేము అనేకసార్లు బాహాటంగానే చెప్పాం కూడా.

పాపం బద్దలయ్యే సమయం దగ్గర పడింది. కాబట్టే వారి రహస్య బంధం కూడా బట్టబయలైంది. రవి ప్రకాష్‌ టీవీ9లోని తన వాటాల్లో కొన్ని నాకు అమ్మి ఆ షేర్లు బదలాయించకుండా నన్ను మోసం చేశారంటూ శివాజీ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించి మరో పెద్ద నాటకానికి తెర తీశాడు. షేర్ల కొనుగోలు కోసం వీళ్ళద్దరూ ఒక తెల్ల కాగితంపై ఒప్పందం రాసుకున్నారంటేనే ఇంత ఎంత హంబగ్గో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా వాటాలు కొనుక్కుంటే తక్షణమే అవి బదిలీ కావాలని కోరుకుంటారు. కానీ ఏడాది తర్వాత చూసుకుందాంలే అనుకున్నారంటేనే దీనిలో నిజానిజాలు ఏమిటో ఎవరికైనా ఇట్టే బోధపడతాయి.

టీవీ9పై పెత్తనం కొత్త యాజమాన్యం చేతుల్లోకి పోకుండా నిలువరించేందుకు ఏడాది క్రితమే పెయిడ్‌ ఆర్టిస్ట్‌ శివాజీని రవి ప్రకాశ్‌ రంగంలోకి దింపాడు. ఈ వ్యూహ రచన అంతా అమరావతిలోని కరకట్టపైనే జరిగింది. దానికి అనుగుణంగానే శివాజీ తెరపైకి వచ్చి ఎన్సీఎల్‌టీలో తన షేర్ల పురాణం విప్పాడు. రవి ప్రకాష్‌, శివాజీ తెర వెనుక నడిపిస్తున్న బాగోతం ఏమిటో ఆరా తీయడానికే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈరోజు వారి ఇళ్ళల్లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. టీవీ9పై పెత్తనం రవి ప్రకాష్‌ చేతుల్లోంచి జారిపోతే అది రాజకీయంగా తమకు తీరని నష్టం జరుగుతుందన్న ఆందోళనతోనే దీనిని ఒక లీగల్‌ సమస్యగా మార్చి యాజమాన్య మార్పును అడుకోవడానికి శివాజీ లాంటి కేరెక్టర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పావులు కదుపుతున్నారు" అని విజయసాయిరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై రవిప్రకాష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.