close
Choose your channels

Modi:వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం, అవినీతిలో నంబర్‌వన్: మోదీ

Monday, May 6, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర చీఫ్‌ పురందేశ్వరి కూడా హాజరయ్యారు. ఈ వేదికపై ప్రధాని మోదీ కాళ్లకు పవన్ నమస్కరించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ "నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. గోదావరి తల్లికి ప్రణామాలు. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇక్కడి నుంచే ఇప్పుడు సరికొత్త చరిత్ర లిఖించబోతున్నాం అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం, అవినీతిలో మాత్రం నంబర్‌వన్ అంటూ ఆరోపించారు. ఏపీ ప్రజలు వైసీపీకి ఐదేళ్లు అవకాశం ఇస్తే.. రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ అభివృద్ధి అనే పట్టాలపై పరిగెత్తగా.. వైసీపీ హయాంలో అభివృద్ధి పట్టాలు తప్పిందని మండిపడ్డారు మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో పెద్ద మద్యం సిండికేట్ నడుస్తోందని అన్నారు. ఐదేళ్లల్లో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నడుస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం మోసం చేసిందని.. ఇన్నేళ్లలో ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేకపోయిందని దుయ్యబట్టారు.

పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చిందని.. అయినా ప్రాజెక్టను పూర్తి చేయకుండా నిలిపివేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని.. అందుకే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని మోదీ ఆరోపించారు. దేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయని.. ఒకటి కాంగ్రెస్, రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నికల ముందే తిరస్కరించగా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పనున్నారని తెలిపారు.

అంతకుముందు పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో దేశమంతా అమృత ఘడియలు నడుస్తుంటే.. ఏపీలో మాత్రం జగన్ పాలనలో విషపు ఘడియలు నడుస్తున్నాయని విమర్శించారు. అయోధ్యకు రామమందిరం తీసుకొచ్చిన మహానుభావుడు మోదీ అని ప్రశంసించారు. మోదీ అధికారంలోకి వచ్చాక కళాకారులకు విలువ పెరిగిందన్నారు. ఈసారి 400 ఎంపీ సీట్లు సాధించాలన్నది మోదీ లక్ష్యమని... అందుకు తమ వంతుగా ఏపీ నుంచి పార్లమెంటు సభ్యులను గెలిపిస్తామని తెలిపారు.

కాగా ఏపీలో ఎన్డీఏ కూటమి పొత్తు కుదిరాక... మార్చిలో చిలకలూరిపేటలో జరిగిన బహిరంగసభలో ప్రధాని పాల్గొన్నారు. అయితే నాటి ప్రసంగంలో వైఎస్ జగన్ మీద, వైసీపీ మీద పెద్దగా ఆరోపణలు లేకుండానే మోదీ ప్రసంగించారు. దాంతో మోదీకి టీడీపీతో పొత్తు ఇష్టం లేదని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వం మీద నేరుగా తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు ఆ పార్టీని ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.