close
Choose your channels

SGT Posts:ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

Wednesday, February 21, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై స్టే విధించింది. విచారణ సందర్భంగా ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ తెలిపారు. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌ల విచారణ మంగళవారం జరిగింది. ఈ విచారణలో ఉన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రాథమికంగా తప్పుపట్టింది.

ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు కూడా సిద్ధపడింది. అయితే ఏజీ స్టే ఇవ్వొద్దని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున వివరాలు సమర్పించేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. డీఎస్సీ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ ఫిబ్రవరి 12న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ డిగ్రీ ఉన్న వారిని అనుమతించింది.

ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా జెట్టిపాలెం గ్రామానికి చెందిన భుక్యా గోవర్ధన సాయినాయక్ మరో నలుగురు డీఈడీ అభ్యర్థులు, హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అలాగే అద్దంకికి చెందిన బొల్లా సురేష్ మరో పిటిషన్ వేశారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదుల బి.ఆదినారాయణరావు, జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం విద్యాహక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్‌సీటీఈ ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపారు.

ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ విద్యావిధానంలో మార్పులు తెచ్చామని.. మూడు నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీంతో బోధనకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులిద్దరూ అవసరమన్నారు. టీచర్లుగా ఎంపికైన వారికి అప్రెంటీస్ కింద రెండేళ్లు శిక్షణ ఉంటుందని వాదించారు. అలాగే ఎంపికైన టీచర్లు ఎన్‌సీటీఈ నిర్వహించే ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఓవైపు శిక్షణ, మరోవైపు పిల్లలకు బోధన ఏవిధంగా సాధ్యమని ప్రశ్నించింది. నోటిఫికేషన్‌పై స్టే ఇస్తామని హాల్‌టికెట్లు జారీచేయవద్దని వ్యాఖ్యానించింది. ఏజీ అభ్యర్థన మేరకు విచారణను బుధవారానికి వాయిదా వేసిన ధర్మాసనం తాజాగా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.