close
Choose your channels

Hyderabad Metro:మెట్రో టైమింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. అధికారులు క్లారిటీ..

Saturday, May 18, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రయాణికుల రద్దీ కారణంగా హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పు లేదని.. ఎప్పటిలాగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే సేవలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. అయితే ప్రతి శుక్రవారం రాత్రి 11:45 గంటల వరకు.. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందన్నారు. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.

ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ వంటి వాటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైళ్ల టైమింగ్స్ విషయంలో ప్రయాణికులెవరూ అయోమయానికి గురి కావొద్దని కోరారు. ఇప్పటిలా యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. కాగా మెట్రో టైమింగ్స్ మారాయని.. ప్రతిరోజూ రాత్రి 11:45 గంటల వరకూ చివరి రైలు అందుబాటులో ఉంటుందని.. ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే రాకపోకలు ప్రారంభం కానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌ మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నట్లు ఎల్‌ అండ్‌ టి సంస్థ ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వో ఆర్‌.శంకర్‌ రామన్‌ ఇటీవల ప్రకటించారు. 2026 తర్వాత మెట్రో రైలు విక్రయానికి సంబంధించిన నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కారణంగానే మెట్రో నిర్వహణ నుంచి వైదొలుగుతున్నట్టు శంకర్ రామన్ తేల్చి చెప్పారు. ఫ్రీ బస్సు పథకంతో మెట్రో ఆదాయం పడిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో మెట్రో రైళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ కూడా దివాళా తీసే పరిస్థితి వస్తుందన్నారు.

ప్రాధాన్యంలేని వ్యాపారాల్లో భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకోనే ఆలోచనలో ఉన్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపించట్లేదన్నారు. మరోవైపు క్యాబ్ సర్వీసులు పెరగడం కూడా మెట్రోపై ప్రభావం చూపుతోందన్నారు. మెట్రో నిర్వహణకు సంబంధించి మరో 65 ఏళ్లు రాయితీలు ఉన్నాయని.. ప్రస్తుతం మెట్రోలో రోజుకు 4.8 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీంతో ఎల్‌ అండ్ టి సంస్థ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మెట్రో నిర్వహణ నుంచి వైదొలగాలి అనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మరో కార్పొరేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటామని తేల్చిచెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.