close
Choose your channels

Pawan Kalyan:పత్రికా కార్యాలయాలపై దాడులు అప్రజాస్వామికం: పవన్ కల్యాణ్

Wednesday, February 21, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. "వైసీపీ సర్కార్‌ వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే అక్కసుతో పాత్రికేయుల మీద, మీడియా కార్యాలయాలపైన దాడులు చేయడం అప్రజాస్వామికం. కర్నూలు నగరంలోని ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడటం గర్హనీయం. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైకాపా మూకలు చేసిన దాడి ఆ పార్టీవాళ్ల హింసా ప్రవృత్తిని వెల్లడించింది. ఇప్పుడు ‘ఈనాడు’పై అదే పంథా చూపించారు. ప్రజాస్వామ్యవాదులు ఈ హింసను ఖండించాలి" అని తెలిపారు.

‘‘రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని భయపెట్టే చివరి ప్రయత్నమే. ఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. వైసీపీ హింసాత్మక చర్యలకు మరో 50 రోజుల్లో ముగింపు పలుకుతాం. ఇటీవల ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, టీవీ5 విలేకరిపై జరిగిన దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు అనాగరిక చర్యలకు పరాకాష్ఠ" అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"పత్రికా స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం హరిస్తోందనడానికి ఈ దాడులే నిదర్శనం. నిజాలు జీర్ణించుకోలేక నిందలు మోపడం, దాడులకు దిగడం, కొట్టి చంపడం అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైసీపీ పాలనలో నిత్యకృత్యం. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి" అని షర్మిల డిమాండ్‌ చేశారు.

"పాత్రికేయులు, మీడియా కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడటం.. రాష్ట్రంలోని అరాచక పాలనకు నిదర్శనం. కర్నూలులో ‘ఈనాడు’ కార్యాలయంపై పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి అనుచరుల దాడి సరికాదు. వైసీపీ మూకదాడులపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి" అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

కాగా కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మొదటి అంతస్తులోని కార్యాలయ బోర్డును, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.