న్యాయవాద దంపతుల హత్య వివరాలను వెల్లడించిన పోలీసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో ప్రధాన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని వెల్లడిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.హత్యకు ఉపయోగించిన నలుపు రంగు బ్రీజా కార్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వామన్‌రావు దంపతులపై దాడి చేసిన ఇద్దరు నిందితులు కుంట శ్రీను, చిరంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో శ్రీ రామస్వామి, గోపాలస్వామి దేవస్థానాల కోసం కుంట శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు, అక్కపక కుమార్ వెల్ది వసంతరావు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఆలయ కార్యదర్శి ఇంద్ర శేఖర్ రావును పిలిచి సమావేశం నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. ఈ గుడి వివాదం కారణంగానే తమ కుమారుడు, కోడలు హత్య జరిగిందని వామన్‌రావు తండ్రి పిటిషన్ ఇచ్చారని పోలీసులు తెలిపారు.
ఆరు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టగా.. నిందితులు తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడి చంద్రపూర్ ప్రాంతంలో ఉన్నారని పక్కా సమాచారం అందిందన్నారు కుంట శ్రీనివాస్, మరో వ్యక్తితో కలిసి తన బ్రీజా కారులో వెళుతుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు గమనించి చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. 17వ తేదీన వామనరావు మంథని కోర్టు వద్దకు వచ్చాడని తెలుసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లేటప్పుడు హత్య చేయాలని నిందితులు పథకం వేసుకున్నారని పోలీసులు ప్రకటనలో తెలిపారు. కుంట శ్రీను.. వామన్‌రావుని ఫాలో అయ్యాడు. కుంట శీనుకి బిట్టు శీను అనే వ్యక్తి తన కారును.. రెండు కొబ్బరి బొండం కొట్టే కత్తులను ఇచ్చాడన్నారు. నిందితులు చిరంజీవి, కుంట శ్రీను ఇద్దరూ కలిసి మంథని చౌరస్తాకి చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
వామన్‌రావు దంపతుల కారును అడ్డగించి కుంట శ్రీను కత్తి తీసుకుని వెళ్లి కారు ముందుకి వెళ్లి అద్దంపై కొట్టడంతో డ్రైవర్ భయపడి కారు ఆపి దిగి పారిపోయాడని... వామన్ రావు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారుని నడపడానికి ప్రయత్నం చేయగా కుంట శీను ఆయనను కారులో నుంచి బయటకు గుంజి కత్తితో అతనిపై దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో చిరంజీవి నాగమణిపై దాడికి పాల్పడ్డాడని తెలిపారు. దాడి జరిగిన తర్వాత వెంటనే కుంట శ్రీను, చిరంజీవి కారులో 8ఇంక్లైన్ కాలనీ నుంచి సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లి బ్యారేజీ వద్ద ఇద్దరూ బట్టలు మార్చుకుని కత్తులను సుందిళ్ల బ్యారేజ్‌లో పడేసి పారిపోయారన్నారు. కుంట శ్రీను నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. 1997వ సంవత్సరంలో సికాసలో చాలా ప్రభావశీలమైన సభ్యుడిగా ఉన్నాడని... బస్సు తగలబెట్టిన కేసులో రిమాండ్‌కు వెళ్ళాడని పోలీసులు వెల్లడించారు. తర్వాత కుంట శ్రీను పోలీసుల ఎదుట లొంగిపోయి రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments