close
Choose your channels

KTR:కరెంట్ బిల్లులు కట్టకండి.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్..

Saturday, January 20, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడి కాంగ్రెస్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో పాతరేస్తానని తెలిపారు. కనుచూపు మేర కూడా ఆ పార్టీ కనిపించదని వ్యాఖ్యానించారు. అలాగే త్వరలోనే పులి బయటికొస్తుందని.. కేసీఆర్ గురించి ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా తనదైన శైలిలో స్పందించారు. పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేళాడదీస్తామని హెచ్చరించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

25 ఏళ్లలో ఎంతోమందిని చూశాం..

వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టాలని మండిపడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని చెప్పిన రేవంత్.. ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారారని విమర్శించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ లాంటి నాయకులను ఈ 25 ఏళ్లలో ఎంతో మందిని చూశామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. ఓడినా గెలిచినా తాము ఎప్పుడూ ప్రజలపక్షమేనని స్పష్టం చేశారు.

రేవంత్ రక్తమంతా బీజేపీదే..

"తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావ్. తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా.. మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తున్నందుకా..? కాంగ్రెస్ బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిసిపోతాయి. రేవంత్ రక్తం అంతా బీజేపీదే. ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారారు. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నారు. స్విట్జర్లాండ్ లో అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారు. అదానీ గురించి రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి మాత్రం ఆదానీ కోసం అర్రులు చాస్తున్నారు." అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరెంట్ బిల్లులు కట్టొద్దు..

జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలెవరూ కట్టవద్దని కేటీఆర్ సూచించారు. కరెంట్ బిల్లులను ఢిల్లీలోని సోనియా గాంధీ ఇంటికి పంపించాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ 50 రోజుల పాలనలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. హామీలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.