close
Choose your channels

'హోరాహోరీ' ఆడియో విడుదల

Thursday, July 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిలీప్‌, ద‌క్ష జంట‌గా శ్రీ రంజిత్ మూవీస్ తెర‌కెక్కిస్తున్న సినిమా హోరాహోరీ. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దామోద‌ర‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. యువ హీరోలు సుమంత్ అశ్విన్‌, ప్రిన్స్, నాగ‌శౌర్య‌, హ‌రీష్ బిగ్ సీడీల‌ను విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను సుమంత్ అశ్విన్ ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో వి.వి. వినాయ‌క్‌, గుణ‌శేఖ‌ర్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, జెమిని కిర‌ణ్‌, బ‌సిరెడ్డి, నందినిరెడ్డి, శ్రీవ‌సంత్‌, ఛోటా.కె.నాయుడు, ప‌రుచూరి ప్ర‌సాద్‌, శైలేంద్ర‌బాబు, స‌మీర్ రెడ్డి, సుద‌ర్శ‌న్ రెడ్డి, గోపీచంద్ మ‌లినేని, మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల‌, మామిడిప‌ల్లి గిరిధ‌ర్‌, ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌, సాంబ‌శివ‌రావు, జీవిత‌, భీమినేని శ్రీనివాస‌రావు, ఈష త‌దిత‌రులు పాల్గొన్నారు.

తేజ మాట్లాడుతూ ``గ‌త ప‌దేళ్లుగా నేను నా స్వ‌భావానికి కాసింత దూరంగా జ‌రిగి నెమ్మ‌దిగా ప్ర‌వ‌ర్తించాను. అంద‌రూ తేజ‌కి కోపం అని అంటుంటే అలా ప్ర‌వ‌ర్తించాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో నేను తీసిన సినిమాల్లోనూ నాదైన ప్ర‌వ‌ర్త‌న ప్ర‌భావం క‌న‌ప‌డింది. కానీ ఇప్పుడు నేను మ‌ర‌లా నా పూర్వ‌పు నైజానికి వ‌చ్చేశాను. అగ్రెసివ్‌గా ఉండ‌ద‌ల‌చుకున్నాను. ఈ సినిమా కూడా అంతే అగ్రెసివ్‌గా ఉంటుంది. ట్రైల‌ర్ చూసిన వాళ్లు ఈ సినిమాను జ‌యంతో పోలుస్తుంటే బాధ‌గా ఉంది. నాకు న‌చ్చ‌లేదు. అందుకే ఇరిటేట్ ఫీల‌వుతున్నాను. నేను జ‌యం సినిమాకి ముందూ సినిమాలు తీశాను. వెనుకా సినిమాల‌ను తీశాను. కానీ జ‌యం ఒక్క‌టే నా జీవితం అన్న‌ట్టు మాట్లాడ‌తారు. అలాగే నేను అన్ని త‌ర‌హాల సినిమాల‌ను తీశాను. కానీ ల‌వ్ స్టోరీలు తీయ‌డంలో తేజ దిట్ట అని ముద్ర‌వేశారు. గ‌త ప‌దేళ్లుగా వ‌చ్చిన తెలుగు సినిమాల‌ను వ‌రుస‌పెట్టి ఇటీవ‌ల చూశాను. వాటిలో రెండే ఫార్ములాలు క‌నిపించాయి.

ఒక‌టి బాబుగారి ఫార్ములా. అంటే హీరోకి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండ‌టం. రెండోది విల‌న్ ఇంట్లో హీరో దూరి ఆడి కూతురికి లైన్ వేయడం. ఇదే క‌థ‌ల‌తో రిపీటెడ్‌గా సినిమాలు వ‌చ్చాయి. వాటిని క‌నీసం రివ్యూలు రాసేవారు కూడా ప‌ట్టించుకోలేదు. కానీ నేనే సినిమాను తీసినా జ‌యంతో పోలుస్తారు. హోరాహోరీ సినిమాలో హీరోయిన్‌, విల‌న్ తెలుగువారు కాక‌పోయినా తెలుగు నేర్చుకుని డ‌బ్బింగ్‌ చెప్పారు. ఈ సినిమాను లైటు, మేక‌ప్ లేకుండా తీశాం. లైటు లేకుండా ప్ర‌యోగం చేద్దామ‌ని అనుకోలేదు. కానీ మేం రెయిన్ కోసం ఓ మెషిన్‌ని త‌యారుచేశాం. ఆ మెషిన్‌ని ఆన్ చేయ‌గానే లైట్ పోయింది. దాంతో లైట్ లేకుండా సినిమా చేయాల్సి వ‌చ్చింది`` అని అన్నారు.

దిలీప్‌, ద‌క్ష మాట్లాడుతూ ``మా తొలి సినిమానే ఇంత పెద్ద డైర‌క్ట‌ర్‌తో చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సినిమా అవుతుంది. క‌ల్యాణ్ కోడూరి గారు మంచి సంగీతాన్నిచ్చారు`` అని చెప్పారు.

దామోద‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``నేను, తేజ క‌లిసి సినిమా చేస్తున్నామ‌న‌గానే చాలా మంది అస‌లు మీ ఇద్ద‌రికి ఎలా పొసుగుతుంది? నువ్వో తిక్కోడివి, ఆయ‌నో తిక్కోడు అని అన్నారు. కానీ క‌లిసి సినిమా చేశాం. క‌ర్ణాట‌క‌లో 53రోజులు షూటింగ్ చేశాం. నేనివాళ ఇక్కడున్నానంటే కార‌ణం మా నాన్న‌గారు. ఆ త‌ర్వాత నా ఫ్రెండ్స్, క‌జిన్స్, బ్ర‌ద‌ర్స్. వారే లేకుంటే ఇవాళ ఇక్క‌డ ఉండ‌క‌పోయేవాడిని. 74-76లో చాంబ‌ర సెక్ర‌ట‌రీగా మా నాన్న ప‌నిచేశారు. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత నేను చేస్తున్నాను. నా సినిమాకు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తున్న స‌హ నిర్మాత‌లు జ‌గ‌న్‌, వివేక్‌కి ధ‌న్య‌వాదాలు`` అని అన్నారు.

గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ ``నేను తేజ రెండేళ్లు రూమ్మేట్స్ గా ఉన్నాం. త‌ను ఓ వండ‌ర్ కిడ్‌. ఇటీవ‌ల త‌న సినిమాలు ఫెయిల్యూర్ కావ‌డానికి కార‌ణం అప్ప‌టి ప‌రిస్థితులే త‌ప్ప‌, త‌న‌లోని టెక్నీషియ‌న్ వెనుక‌బ‌డ్డాడ‌ని మాత్రం కాదు. త‌ను క‌థ‌ను చాలా బాగా చెప్ప‌గ‌ల‌డు. ఈ సినిమా అత‌నికి మంచి హిట్‌ను తెచ్చిపెట్టాలి`` అని చెప్పారు.
వినాయ‌క్ మాట్లాడుతూ ``ప్ర‌తి ఒక్క‌రికీ జీవితంలో బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో నాకు మా బుజ్జి, తేజ ఇద్ద‌రూ తోడున్నారు`` అని తెలిపారు.

జీవిత మాట్లాడుతూ ``నేను తేజ మూడో త‌ర‌గ‌తి నుంచి క‌లిసి చ‌దువుకున్నాం. అలాగే మా పిల్ల‌లు, తేజ పిల్ల‌లు కూడా క‌లిసి చ‌దువుకున్నారు. తేజ కూతురు ఐలా ఈ సినిమాలో ఓ పాట పాడింది. పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.

క‌ల్యాణ్ కోడూరి మాట్లాడుతూ ``ఇందులో ఎనిమిది పాట‌లున్నాయి. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తేజ‌గారు ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చి చేయించుకున్నారు. ఇద్ద‌రు పీమేల్ సింగ‌ర్స్ ని ఈ సినిమాతో ప‌రిచ‌యం చేస్తున్నాం`` అని చెప్పారు.
గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ ``మాత‌రంలో చాలా మంది ద‌ర్శ‌కుల‌కు తేజ‌గారు స్పూర్తి. ఆయ‌న‌తో పెద్ద ప‌రిచ‌యం లేక‌పోయ‌నా, ఆయ‌న సినిమాల‌తో నాకు ఎక్కువ ప‌రిచ‌యం ఉంది`` అని చెప్పారు.

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ``నాకు గురువుగారు తేజ‌గారు. మా కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తే బావుంటుంద‌ని చాలా మంది అడుగుతున్నారు. త‌ప్ప‌క అది నెర‌వేరుతుంది. నేను డైర‌క్ష‌న్ చేయ‌డం తేజ‌గారికి ఇష్టం లేదు. అయినా ఆయ‌న్నుంచే నాకు ఆ ఇచ్చింగ్ మొద‌లైంది. నేను చేసిన దానిలో ఏదైనా మంచి ఉందంటే అది తేజ‌గారి క్రెడిట్‌. త‌ప్పు ఉంటే మాత్రం అది నా త‌ప్పే`` అని అన్నారు.

మ‌ధుర శ్రీధ‌ర్ మాట్లాడుతూ ``ఆడియో చాలా బావుంది. మ‌ధుర ద్వారా విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.