close
Choose your channels

పల్లెబాట పట్టిన నగరవాసులు.. రద్దీగా హైదరాబాద్-విజయవాడ హైవే..

Friday, January 12, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పల్లెబాట పట్టిన నగరవాసులు.. రద్దీగా హైదరాబాద్-విజయవాడ హైవే..

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ 'సంక్రాంతి'. సంక్రాంతి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే పల్లెలు, పట్టణాలు పండుగకు సిద్ధమవుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామాల్లో అయితే పండుగ వాతావరణం వేరే లెవల్లో ఉంటుంది. ఇళ్ల రకరకాల ముగ్గులు, పిండి వంటలతో పండుగ శోభ సంతరించుకుంటోంది. దీంతో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా పండుగకు సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఈసారి కూడా ఉపాధి కోసం నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలు ఈ ఐదు రోజులు సొంతూళ్లలో బంధువుల మధ్య పండుగను జరుపుకునేందుకు పల్లె బాట పట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. దాంతో చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు కూడళ్లు వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోతుంది.

పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు క్యూ కట్టాయి. దీంతో టోల్ సిబ్బందితో పాటు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, గుండ్లబావి క్రాసింగ్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. అలాగే కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద అదనపు టోల్ బూత్స్ ఏర్పాటు చేయడంతో కొంతమేర ట్రాఫిక్ తగ్గింది. మరో రెండు రోజుల పాటు రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

పల్లెబాట పట్టిన నగరవాసులు.. రద్దీగా హైదరాబాద్-విజయవాడ హైవే..

మరోవైపు సొంత వాహనాలు లేని వాళ్లు.. బస్సులు, రైళ్లలో సొంతూళ్లకు చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లు వేసినా జనాలకు సరిపోవడం లేదు. జనరల్ బోగీలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC), టీఎస్ఆర్టీసీ(TSRTC) కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. తెలంగాణ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు.

అటు ఏపీఎస్ఆర్టీసీ సైతం హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం 6,725 బస్సులను నడుపుతోంది. వీటితో పాటు హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూ­లు, అనంతపురం, తిరుపతి, నెల్లూ­రు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నంకు అదనంగా 1000 బస్సు సర్వీసులు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే బెంగళూరు, చెన్నై నగరాల నుంచి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు కూడా ప్రత్యేక బస్సు­లు నడిపేలా చర్యలు తీసుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.