Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ మాటలకు విలువేదీ..? గతంలోనూ తప్పిన అంచనాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ గతంలో కొన్ని పార్టీల తరపున పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి బీహార్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. సొంతంగా పార్టీ పెట్టుకుని అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకు ప్రజల్లో ఆదరణ రాకపోవడంతో డీలా పడ్డారు. దీంతో తన ఉనికి కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫలానా పార్టీ గెలుస్తుంది.. ఫలానా పార్టీ ఓడిపోతుందంటూ చెబుతూ ఉంటారు.
చంద్రబాబుతో రహస్య భేటీలు..
తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. అయితే ఆయన మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో పీకే తరుచూ భేటీ అవుతున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. వచ్చే ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నారంటూ చెబుతున్నారు. ఆయన అలా చెప్పడం ఆలస్యం పచ్చ మీడియా దానిని హైలైట్ చేస్తూ రెచ్చిపోతుంది. వైసీపీ పని అయిపోయింది.. జగన్ ఓడిపోవడం ఖాయమనే వార్తలను ప్రచారం చేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
సీఎం జగన్‌ను నేరుగా ఢీ కొట్టలేక..
ప్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ.... ఓడిపోయే పార్టీకి డైలాగులు ఎక్కువ... ఈ నానుడిని ఏపీలో ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేమని అర్థమైన టీడీపీ- జనసేన కూటమి ఇప్పుడు తప్పుడు ప్రచారాలకు తెరదీసింది. లేని హైప్‌ను ఉన్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలకు సిద్ధమైంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో పాటు అశేషమైన కార్యకర్తల బలంతో దూసుకుపోతున్న జగన్‌ను ఎదుర్కోవడం అసాధ్యమని భావిస్తున్నాయి. దీంతో తమ భవిష్యత్ కళ్ళ ముందు కదలాడుతుండగా చంద్రబాబు తన కుట్రలను బయటకు తీశారు. అందులో భాగంగా ఏనాడో రాజకీయ వ్యూహకర్త అనే వృత్తిని వదిలేసి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్‌తో తప్పుడు వ్యాఖ్యలు చేయిస్తున్నారు.
దక్షిణాదిలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచేనా..?
తెలంగాణలో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి తొలి స్థానంలో నిలుస్తుందని.. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే పీకే చెప్పినట్లు వాస్తవ పరిస్థితులు లేవు. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో కన్నడ రాష్ట్రంలో ఆ పార్టీకి 25 ఎంపీ సీట్లు రాగా.. తెలంగాణలో 4 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు జరగాలంటే బీజేపీకి సొంతంగా 30 సీట్లు కంటే ఎక్కువ రావాలి. కానీ గ్రౌండ్ రియాల్టీ చూస్తుంటే అది జరిగే పరిస్థితి కనడపడటం లేదు. కేవలం కర్ణాటకలో మాత్రమే 15-20 సీట్లు వచ్చేలా ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో తప్పిన అంచనాలు..
అందుకే ఒక సంస్థతో కలిసి పనిచేసినప్పుడు లభించే ఫీడ్‌బ్యాక్ ప్రశాంత్ కిశోర్‌కు ఇప్పుడు లభించే అవకాశం లేదు. దీంతో ఆయన చేస్తోంది గాలివాటం ప్రకటనలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. చివరకు బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ ప్రశాంత్ కిషోర్ చెప్పిన అంచనాలు పూర్తిగా తప్పాయి. ఇప్పుడు ఏపీలోనూ ఆయన అంచనాలు తప్పడం ఖాయమని అంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా జనాల్లో జగన్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగనే అని స్పష్టంచేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout