close
Choose your channels

జనసేనకు భవిష్యత్ లేదు.. పవన్‌కు...: రాపాక సంచలన వ్యాఖ్యలు

Saturday, December 14, 2019 • తెలుగు Comments

జనసేనకు భవిష్యత్ లేదు.. పవన్‌కు...: రాపాక సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ.. ఆ పార్టీ తరఫున పోటీచేసిన రాపాక వరప్రసాద్ గెలిచి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. దీంతో రాపాక పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా మార్మోగింది. వాస్తవానికి పార్టీ అధినేత అది కూడా రెండు చోట్ల పోటీ చేసిన అట్టర్ ప్లాప్ అయిన సందర్భాలు ఇప్పటి వరకూ అస్సల్లేవ్.!. ఈ వన్ అండ్ ఓన్లీ మాత్రం పవన్‌ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్‌ను ఆకాశానికెత్తేయడం.. ఆ తర్వాత జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం గట్రా పనులు చేసిన రాపాక తాజాగా.. పవన్‌కు ఊహించని రీతిలో ఝలక్ ఇచ్చారు. అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ, పవన్ కల్యాణ్‌, అసలు ఎవరివల్ల పార్టీ ఈ పరిస్థితిలో ఉంది..? దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరు..? అనే ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జనసేనకు భవిష్యత్ లేదు.. పవన్‌కు..!

‘జనసేనలో కొన్ని మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. కొన్ని సరైన నిర్ణయాలను తీసుకోకపోతే పార్టీ ముందుకు సాగదు. నా భవిష్యత్తు గురించి కూడా నేను ఆలోచించాలి. అయితే.. నాకు ఇంతవరకు జనసేన నుంచి షోకాజ్ నోటీసులు రాలేదు. వైసీపీతో నాకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. అసెంబ్లీలో మైక్ దొరకదు. నేను జనసేనలోనే ఉన్నాను. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కేడర్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సమస్యలపై కేడర్ స్పందించేలా బాధ్యతను అప్పగించాలి. అన్ని సమస్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే హాజరవుతుంటే.. పార్టీ బలోపేతం కాదు. సీఎం కావాలనే బలమైన సంకల్పం పవన్‌లో ఉండాలి.. అప్పుడే పార్టీ ముందుకు సాగుతుంది. ప్రతి దానికి అధినేతే వచ్చి ఆందోళన చేయడం సరికాదు. ప్రస్తుతానికైతే భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉంది’ అని రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొత్తం ఆయనే చేస్తున్నారు!

ఈ సందర్భంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ గురించి మాట్లాడిన ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తాము పార్టీని వీడటానికి మనోహరే కారణమని చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై అధినేత పవన్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే సంప్రదించుకుంటారు. వ్యక్తిగతంగా నాదెండ్లతో నాకు ఇబ్బంది లేు. అసెంబ్లీ సమావేశాల కారణంగానే పవన్ దీక్షకు నేను హాజరుకాలేదు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలను చేపడితే నేను ప్రశంసిస్తాను’ అని మరోసారి అదే మాట రాపాక చెప్పారు.

పార్టీ మారాలనుకోవట్లేదు!

రాపాక పార్టీ మారుతారని.. త్వరలోనే రాజోలులో ఉపఎన్నిక జరుగుతుందని వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. అయితే దీనికి తోడు.. అటు మీడియా ముందు.. ఇటు అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించడం.. అధినేత, కార్యకర్తల నుంచి చీవాట్లు పడటంతో రాపాక గుడ్‌పై చెప్పేయాలని దాదాపు ఫిక్సయ్యారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పార్టీ మార్పుపై ఆయన మాట్లాడారు. ‘నేను పార్టీ మారాలనుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం అన్నది సర్వసాధారణమే. గతంలో నేతలకు రాజకీయ విలువలు ఉండేవి.. పార్టీ మారే నేతలను ప్రజలు కూడా వ్యతిరేకించేవారు. ఇప్పుడు నేతలకు నిజాయతీ లేదు.. నేతలు పార్టీలు మారినా ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు’ అని రాపాక చెప్పుకొచ్చారు. అంటే రాపాక మనసులో పార్టీ మారాలని ఉందా..? లేదా..? లేకుంటే పరోక్షంగా పార్టీ మారుతున్నానని.. ఇలా చెబుతున్నారా..? అనేది మాత్రం రాపాకకే తెలియాల్సి ఉంది. కాగా వన్ అండ్ ఓన్లీ వ్యాఖ్యలపై పవన్, నాదెండ్ల, సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz