Kejriwal:లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట
Send us your feedback to audioarticles@vaarta.com
లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఏప్రిల్ 2లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. కాగా లిక్కర్ స్కాంలో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు రౌస్ ఎవెన్యూ కోర్టు మార్చి 28వరకు కస్టడీ విధించింది.
ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి సంచలన వార్తలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం బాగాలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డయాబెటిస్ ఉన్న కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీలో షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్ శరీరంలో షుగర్ స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నట్లు.. ఒక దశలో ఆయన షుగర్ లెవల్స్ ఏకంగా 46 ఎంజీ స్థాయికి పడిపోయాయని చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో చక్కెర లెవల్స్ పడిపోవడం అత్యంత ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు చెప్పినట్లు ఆప్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక అంతకుముందు కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా ఈడీ కస్టడీలో ఉన్నఆయనను కలిసినపుడు తనకు షుగర్ లెవల్స్ పడిపోతున్నట్లు చెప్పారని వెల్లడించారు. కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉండాలని అందరం ప్రార్థిద్దామని పిలుపునిచ్చారు. అలాగే గురువారం రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు కేజ్రీవాల్ బయటపెడతారని తెలిపారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలను ఇస్తారని.. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లాయి అనే వివరాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో కేజ్రీవాల్ కోర్టులో ఏం చెప్పనున్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత మరో రబ్రీదేవి కానున్నారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. 1997లో బీహార్‌లో పశుగ్రాసం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టయ్యాక రబ్రీదేవి కూడా ఇలాగే సీఎం కుర్చీలో కూర్చుని వీడియో సందేశాలు ఇచ్చేవారని.. క్రమంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో సునీత కూడా ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతారని వ్యాఖ్యానించారు. మరోవైపు జైలు నుంచే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ నేతల వ్యాఖ్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ప్రభుత్వాన్ని జైలు నుంచి నడపబోమని స్పష్టంచేశారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout