Konda Surekha: ట్యాపింగ్ ఆరోపణలపై మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన మరికొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్‌కు మరోసారి కూడా నోటీసులు పంపించారు.
తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేదే లేదన్నారు. అయితే ఈ నోటీసులపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. లీగల్ నోటీసులు పంపిస్తే భయపడేది లేదని అది పెద్ద సమస్యే కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోలో కేటీఆర్ లేనప్పుడు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. చేసిందే బుద్ధి తక్కువ పని.. దానిని సమర్థించుకోవడానికి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
అంతకుముందు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఎవరో హీరోయిన్లను బెదిరించానని తనపై ఓ మంత్రి విమర్శలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు భయపడే వ్యక్తిని కాదని.. ఇలాగే అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేస్తే ఎవర్నీ వదిలిపెట్టామని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీకు వీరుడిలాగా మారారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కాకుండా వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టాలని సూచించారు.
కాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశామని అరెస్ట్ అయిన అధికారులు తెలిపారు. దీంతో ఈ కేసు గులాబీ నేతల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఆయా నేతలకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారు. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని.. త్వరలోనే అందరికి చట్టప్రకారం శిక్ష పడటం ఖాయమని స్పష్టంచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout