close
Choose your channels

Lokesh :ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల 'శంఖారావం'కి లోకేష్ సిద్ధం

Thursday, February 8, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మరోసారి ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల యువగళం పాదయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈనెల 11 నుంచి 'శంఖారావం' పేరిట ప్రచారానికి రెడీ అయ్యారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ రూపొందించారు. శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు పర్యటన సాగనుందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 11వ తేదీ ఉదయం 9 గంటలకు తొలి సభ జరుగనుందని పేర్కొన్నారు. ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపటమే శంఖారావం లక్ష్యమన్నారు. సీఎం జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా లోకేశ్ పర్యటన సాగనుందని వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 'రా.. కదలిరా' పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా జనాల్లోకి రానున్నారు. అలాగే చంద్రబాబుతో కలిసి భారీ బహిరంగసభల్లోనూ పాల్గొననున్నారు. మొత్తానికి సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు రావడంతో టీడీపీ-జనసేన కూటమి ప్రచారంలో స్పీడ్ పెంచింది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో గతేడాది జనవరి 27న యువగళం పాదయాత్రను లోకేష్‌ ప్రారంభించారు. మొత్తం 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా 226రోజులు పాటు 3,132 కిలో మీటర్ల మేర సాగిన పాదయాత్రను డిసెంబర్ 18న ముగించారు. మధ్యలో నందమూరి తారకరత్న ఆకస్మిక మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌, చంద్రబాబు అరెస్ట్ సమయంలో పాదయాత్రకు విరామం ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.