close
Choose your channels

ఇకపై మహిళల కోసం సినిమాలు చేస్తా .. పెద్ద కలలు కనండి: భారతీయ అమ్మాయిలకు పూజా హెగ్డే సూచనలు

Monday, May 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది పూజాహెగ్డే. ‘‘ఒక లైలా కోసం’’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. వరుసపెట్టి సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ పేరు రాలేదు. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురం సినిమా బ్లాక్‏బస్టర్ హిట్ కొట్టడంతో పూజా రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. 2020 నుంచి నేటి వరకు రిలీజైన స్టార్ హీరోల సినిమాలలో కథానాయిక పూజా హెగ్డేనే. ఆమె ఇప్పుడు ఎంత బిజీ అంటే కాల్‌షీట్లు, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని సినిమాలను కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది.

ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్’’, అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘‘ఆచార్య’’, ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ‘‘బీస్ట్ ’’ చిత్రంలో పూజానే హీరోయిన్. ఇవి కాకుండా పవన్‌ కల్యాణ్- హరీశ్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో ఆమె ఛాన్స్ దక్కించుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాళీ’, రోహిత్ శెట్టి సరసన ‘సర్కస్’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ ఏడాది ఆమె కెరీర్‌లో గోల్డెన్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. ఎందుక‌ంటే సినిమాల‌కు సంబంధించిన జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న పెడితే, తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ రెడ్ కార్పెట్‌పై న‌డిచే అవ‌కాశం ద‌క్కింది. హాలీవుడ్ దిగ్గజాలు, ఇంటర్నేషనల్ మీడియా సమక్షంలో పూజా హెగ్డే తెల్ల‌టి అంద‌మైన గౌనులో రెడ్ కార్పెట్‌పై చిరున‌వ్వులొలికిస్తూ వాక్ చేసింది.

ఈ సందర్భంగా అక్కడి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. భారతీయ యువతులు పెద్ద కలలు కనాలని పిలుపునిచ్చారు. తాను మహిళల కోసం కొన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు పూజా తన మనసులోని మాట చెప్పారు. మనదేశంలో మహిళలకు తగిన ప్రాతినిథ్యం లేదని .. ఏదైనా సినిమాలో పవర్‌ఫుల్ రోల్‌లోని మహిళను చూసినప్పుడు, ఆడపడుచులు ఆ పాత్రను అనుకరించాలని భావిస్తారని... తాము కూడా అలా ఎందుకు కాకూడదనే ఆలోచన వారిలో మొదలవుతుందని పూజా వ్యాఖ్యానించారు. భారతదేశంలోని అమ్మాయిలు పెద్ద కలలు కనేలా.. వారి అంతర్గత సామర్ధ్యాన్ని వెలికితీసేందుకు స్పూర్తినిచ్చే విషయంలో తాను కూడా చిన్న భాగం కావాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ వంటి భారతీయ సినిమాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ క్రమంలోనే పూజా హెగ్డేకు కూడా ఇటు భారత్‌లోనూ, అటు విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఆస్కార్ విజేత బాంగ్ జూన్ హోను ఉద్దేశించి పూజా మాట్లాడుతూ.. మనం భాషలను అడ్డంకిగా చూడటం మానేయాల్సిన సమయం వచ్చిందన్నారు. దీనిని అధిగమించినట్లయితే అద్భుతమైన కంటెంట్ వెలుగులోకి వస్తుందన్న పారాసైట్ చిత్ర దర్శకుడి మాటలను పూజా హెగ్డే గుర్తుచేశారు.

భారతదేశం సాంస్కృతికంగా వైవిధ్యమైనదని, సంపన్నమైనదని కొనియాడారు పూజా హెగ్డే. తాను ఇతరులను తెలివైన రీతిలో , వ్యక్తిగత మార్గంలో అర్ధం చేసుకునేలా చేయడానికి సినిమాను ఒక మాధ్యమంగా భావిస్తానని ఆమె పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.