close
Choose your channels

మళ్లీ ఢిల్లీకి పవన్.. ఏపీలో హాట్ టాపిక్

Monday, March 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మళ్లీ ఢిల్లీకి పవన్.. ఏపీలో హాట్ టాపిక్

దాడులు, బెదిరింపులతో అప్రజాస్వామికంగా జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియను రద్దు చేసి, ఎన్నికల ప్రక్రియను తాజాగా చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నామినేషన్ల ప్రక్రియ భయానక వాతావరణంలో దౌర్జన్యపూరితంగా, ఏకపక్షంగా జరిగాయన్నారు. భౌతిక దాడులు, ఆర్ధిక మూలాలు దెబ్బ తీసేందుకు ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులతో బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 6 వారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హింసాత్మకంగా జరిగిన నామినేషన్ ప్రక్రియను సైతం రద్దు చేసి తిరిగి చేపట్టాలని కోరారు. సోమవారం నాడు రాజమహేంద్రవరంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీని గెలిపిస్తే రాష్ట్రంలో హింస ఎక్కువైపోతుందని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.

గెలుపుపై వైసీపీకి భయం!
‘ఈనాడు ఆంధప్రదేశ్ లో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా హింసాత్మక సంఘటనలు, పాలెగాళ్ల రాజ్యమే కనిపిస్తుంది. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కూడా రౌడీయిజం పెరిగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. అందులో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి గెలిచే అవకాశాలు ఇంకా ఎక్కువ. కానీ వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుపై భయపడుతోంది. ప్రతిపక్షాల అభ్యర్ధులను బెదిరించి, దాడులు చేసి గెలవాలని చూస్తోంది. ప్రభుత్వం ఎంత దిగజారి వ్యవహరించినా ప్రజాస్వామ్యం గొంతు నొక్కలేరు’ అని పవన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటం రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి కొమ్ముకాసే విధంగా ప్రవర్తించడం బాధాకరం. పాలన విభాగంలో తప్పులు జరిగితే సరిదిద్దాల్సిన అధికారులు... తమ కళ్లెదుటే ఇన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతుంటే చేతులు కట్టుకొని చూశారు. ప్రభుత్వంతో ఏకమై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. నిన్న మూడు గంటలతో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే... రాత్రి పది గంటల వరకు పోలీసుల సాయంతో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్ధులను బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేశారు. ఏదైనా ప్రాంతంలో అభ్యర్ధిపై దాడులు జరిగితే అక్కడ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలి. జనసేన అభ్యర్ధులు, వారితోపాటు నామినేషన్ వేయడానికి వెళ్లిన నాయకులపై దాడులు జరిగితే అసలు ఏమీ జరగనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నామినేషన్ వేయాలంటే భయపడే పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ పాలకులు, పై అధికారుల ఒత్తిళ్లతో వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు’ అని పవన్ తెలిపారు.

కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తాం
‘అధికారులు ఎవరెవరూ ఏ స్థాయిలో వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాచారో నివేదిక తయారు చేస్తున్నాం. దానిని త్వరలోనే ప్రజలకు విడుదల చేస్తాం. వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ఈ రోజు మీరు రెచ్చిపోవచ్చు ... భవిష్యత్తులో మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయిస్తాం. హింసాత్మక సంఘటలపై అన్ని ఆధారాలు సేకరించి కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాయడంతో పాటు.. నివేదికను పట్టుకొని స్వయంగా నేనే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తా. రౌడీలు మదబలంతో రాజ్యమేలుతామంటే చూస్తే ఉరుకోం. ఎదురు తిరుగుతాం’ అని పవన్ ఒకింత వార్నింగ్ ఇచ్చారు. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పవన్ ఫిర్యాదుపై కేంద్రం, ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.