close
Choose your channels

TDP-BJP-JSP: తేలిన పొత్తు లెక్క.. పోటీ చేసే స్థానాలు ప్రకటించిన టీడీపీ-బీజేపీ-జనసేన..

Tuesday, March 12, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

TDP-BJP-JSP: తేలిన పొత్తు లెక్క.. పోటీ చేసే స్థానాలు ప్రకటించిన టీడీపీ-బీజేపీ-జనసేన..

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై కూడా క్లారిటీ వచ్చేసింది. సోమవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల సమావేశం జరిగింది. మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటల పాటు సీట్ల సర్దుబాటు, కూటమి వ్యూహాలపై సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండా, జనసేనాని పవన్ కల్యాణ్‌, చంద్రబాబు పాల్గొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చారు.

175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుండగా.. జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో బరిలో దిగనున్నాయి. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పొత్తు ధర్మం పాటిస్తూ తనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో 3 స్థానాలు బీజేపీకి కేటాయించగా.. టీడీపీ ఓ స్థానాన్ని వదులకుంది. దీంతో మొత్తం 10 ఎమ్మెల్యే సీట్లు కమలనాథుల ఖాతాలో పడ్డాయి. ధర్మవరం, జమ్మలమడుగు, తిరుపతి, విశాఖ నార్త్, బద్వేల్, కైకలూరు, పాడేరు వంటి స్థానాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఎంపీ స్థానాలకు వస్తే అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థులు.. మిగిలిన నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తారు.

TDP-BJP-JSP: తేలిన పొత్తు లెక్క.. పోటీ చేసే స్థానాలు ప్రకటించిన టీడీపీ-బీజేపీ-జనసేన..

ప్రధాని మోదీ నాయకత్వంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సంయుక్త ప్రకటన చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రజల స్థితి గతులు మెరుగు పరిచేందుకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని, ఎన్డీఏ భాగస్వాములుగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపాయి. తమ కూటమిని ఆశీర్వదించాలని ప్రజలను కోరాయి. కాగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై మూడు రోజుల పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం రెండు పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ పెద్దలు అధికారికంగా ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.