close
Choose your channels

ఒంగోలులో అల్లరిమూకలపై కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే..?

Monday, May 20, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒంగోలులో అల్లరిమూకలపై కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే..?

ఏపీలో పోలింగ్ ముగిసినా కూడా ఎక్కడో చోట హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే కౌంటింగ్ రోజుతో పాటు తర్వాత కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నాయని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ నెలకొని ఉంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్‌ క్యానన్‌లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు బస్టాండ్‌ సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేసి టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆపై వాటర్‌ క్యానన్‌లతో అల్లరి మూకలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి, అనంతరం కాల్పులు జరిగిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ఇది మాక్‌ డ్రిల్‌ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్‌ రోజున పార్టీల కార్యకర్తలు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. దీంతో వారిని ఎదుర్కోవడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్దంగా ఉన్నారని తెలియజేయడానికి ఒంగోలులో పోలీసులు క్రౌడ్‌ కంట్రోల్‌ మాక్‌ డ్రిల్ నిర్వహించారు. దీనికోసం ఒంగోలులో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌ కూడలిని ఎంచుకున్నారు. ఒక్కసారిగా అల్లరిమూకల వేషాల్లో ఉన్న పోలీసులు బస్టాండ్ సెంటర్‌లోకి దూసుకొచ్చారు.

కౌంటింగ్‌లో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పోలీస్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు. దీంతో పోలీసులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుని అల్లరి మూకలను కట్టడి చేసేందుకు తొలుత హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జి చేశారు. దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు కూడా విసిరారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. అనంతరం వాటర్‌ క్యానన్‌లతో ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినా కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్‌ చేశారు.

ఈ కాల్పుల్లో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొంతమంది రోడ్డుపై పడిపోయారు. క్షతగాత్రులను పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. 20 నిమిషాల పాటు రణరంగాన్ని తలపించిన ఈ తతంగాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. కౌంటిగ్ రోజున ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు ఇలా మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్టు ఎస్పీ గరుడ్ సుమిత్‌ సునీల్‌ తెలిపారు. కౌంటింగ్‌ రోజుతో పాటు ఆ తరువాత ఎవరైనా అల్లరి మూకలు ఆందోళనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.