close
Choose your channels

చంద్రబాబు ‘లెక్క’లు తేల్చిన వైసీపీ!

Tuesday, January 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబు ‘లెక్క’లు తేల్చిన వైసీపీ!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీలు మూటగట్టుకుని ప్రజలముందు వచ్చి వాలిపోతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశామన్నది దెవుడెరుగు. కొత్త కొత్త హామీలతో మళ్లీ సీఎం చంద్రబాబు జనాల్లోకి రావడం.. మరోవైపు ఇప్పటికే నవరత్నాలు ప్రకటించిన జగన్.. పాదయాత్రతో ప్రజలకు దగ్గరవ్వడం.. తమ పార్టీకి ఓటేస్తే అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తానని పవన్ చెబుతున్నారు. దీంతో అసలు ఎవరికి ఓటేయాలి..? ఎవరి హామీలు నమ్మాలి..? అని ఏపీలో ఏ ఇద్దరు కలిసినా దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే 2014 నుంచి నేటి వరకు చంద్రబాబు అసలు ఏం చేశారు..? ఆయనిచ్చిన హామీలేంటి..? ఎన్ని అమలు చేశారు..? ప్రభుత్వ ధనం ఎంత వృథాగా ఖర్చుపెట్టారనే విషయాలను ‘లెక్క’లతో సహా వైసీపీ బయటపెట్టింది. ఇటీవల వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పూసగుచ్చినట్లుగా లెక్కలన్నీ చెప్పారు.

నిరుద్యోగ భృతి..

"2014లో నిరుద్యోగ భృతి రూ. 2 వేలు అని చెప్పిన చంద్రబాబు నాలుగున్నరేళ్లు దాన్ని అమలు చేయలేదు. ఎన్నికలు మరో ఆరు నెలలు ఉందనగా మూడు లక్షల మందిని గుర్తించి రూ. వెయ్యి చొప్పున ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారు. చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నిరుద్యోగ భృతి నాలుగున్నరేళ్లుగా ఎందుకు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు?. ఖాళీలు ఏర్పడిన స్థానాల్లో భర్తీలు లేకపోవడం, పరిశ్రమలు రాకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అల్లాడుతున్నారన్నారు" అని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఎంత చులకన భావమో..!

"ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారు. మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదిన్నర క్రితం ప్లీనరీలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో నవరత్నాల ద్వారా ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పథకాలనే చంద్రబాబు ఎన్నికలకు రెండు నెలల ముందు అమలు చేస్తున్నారు. ఉన్నట్టుండి పెన్షన్‌ రూ. 2 వేలు, తొమ్మిది గంటల కరెంటు అంటున్నారు. దీన్ని ఎల్లో మీడియా గొప్పగా చూపించడం విడ్డూరంగా ఉంది. ప్రజలంటే చంద్రబాబుకు ఎంత చులకన భావమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు" అని ఆయన చెప్పుకొచ్చారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత చంద్రబాబుదే!

"ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 వాగ్ధానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా.. కొత్త కార్యక్రమాలు ఒక్కటీ చేపట్టకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత చంద్రబాబుదే. రూ. 96 వేల కోట్లు ఉన్న అప్పును చంద్రబాబు ఏకంగా రూ. 2 లక్షల కోట్లకు పెంచారు. ఇవేకాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చాలానే ఉన్నాయి. రాష్ట్రం దివాళా తీసిన పరిస్థితుల్లో ఉంటే నెలన్నరలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనగా కొత్త నాటకాలు ఆడుతూ అధికారంలోకి రావడం కోసం కుయుక్తులు పన్నుతున్నారు. దీన్ని ప్రజలంతా గమనించి చంద్రబాబును నిలదీయాలి. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో ‘0’గా ఉన్న రెవెన్యూ డెఫిసిట్‌ 1.91 వేల కోట్లకు వెళ్లిందని వారే చెప్పారు. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పండి..?. రాజధాని మూవ్‌ చేయడానికి, విదేశాల ఖర్చు, దుబారాకు వేల కోట్ల రూపాయలను చంద్రబాబు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు జీతాల కోసం కొత్తగా రూ. 10,500 ఆర్‌ఈసీ నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా అంతా ఎక్కడకు పోయింది" అని ఈ సందర్భంగా చంద్రబాబుపై సజ్జల సూటి ప్రశ్నల వర్షం కురిపించారు.

బాబు మాటలు నమ్మి జేబులో నుంచి..

"రుణామాఫీతో చంద్రబాబు రైతులను దగా చేశారు. రైతులు చంద్రబాబు మాటలు నమ్మి జేబుల నుంచి బ్యాంకులకు వడ్డీ రూపంలో రూ. 40 కోట్లు కట్టారు. సున్నా శాతం వడ్డీ రుణాలు కూడా కోల్పోయారు. రుణమాఫీకి సంబంధించి ఆఖరి రెండు విడతలు జనవరి మొదటి వారంలో చెల్లిస్తామని చెప్పిన మంత్రి సోమిరెడ్డి ఇప్పటి వరకు చెల్లించిన దాఖలాలు లేవు. బ్యాంకుల నుంచి రుణం తీసుకొచ్చి చెల్లించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలి. కష్టాల్లో ఉన్నామని చెప్పడానికి ఒక పత్రం, మరోపక్క డబుల్‌ డిజిట్‌ సాధించామని మరో పత్రం చూపిస్తూ జనాలను నిలువెత్తునా మోసం చేస్తున్నారు" అని బాబుపై సజ్జలు ఆరోపించారు.

ప్రజలు ధీనావస్థలో.. మీరేమో అభివృద్ధి!

"రాష్ట్ర ప్రజలంతా దీనావస్థలో ఉంటే చంద్రబాబు, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి జన్మభూమి కమిటీలు అభివృద్ధి చెందుతున్నారు. వెల్‌కం గ్యాలరీకి రూ. 42 కోట్లు ఖర్చు చేశారు. టెంప్రరీ పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మూడేళ్లలో 11 కిలోమీటర్ల పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే, విమానాశ్రయం నిర్మించారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఎందుకు ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదు. చంద్రబబు చేసిన అవినీతికి, దుబారాకు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయి" అని సజ్జల వ్యాఖ్యానించారు. కాగా.. వైసీపీ లెక్కలకు టీడీపీ నుంచి స్పందన వస్తుందా..? రాదా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.