close
Choose your channels

Heart Attack : అప్పటిదాకా ఆటపాటలతో సందడి, అంతలోనే విషాదం.. గుండెపోటుతో 12 ఏళ్ల చిన్నారి మృతి

Tuesday, January 10, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గుండెపోటు.. గతంలో 50 పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా భయపెడుతోంది. 30 లోపు యువకులే కాదు.. చిన్నారులు సైతం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతుండటం నిపుణులను భయపెడుతోంది. తాజాగా కర్ణాటకలో 12 ఏళ్ల బాలుడు హార్ట్ ఎటాక్‌తో చనిపోవడంతో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. మడికేరి జిల్లా కుశాలనగర తాలూకా కూడుమంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కీర్తన్ అనే బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తోటి పిల్లలతో ఆడుకుని, రాత్రికి ఇంట్లోకి వచ్చాడు. ఆపై తనకు గుండెల్లో నొప్పిగా వుందంటూ విలవిలాడిపోయాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు బాలుడిని వెంటనే కుశాలనగరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు .. కీర్తన్ అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

2030 నాటికి భారత్‌లో అత్యధిక గుండెజబ్బులు:

ఇదిలావుండగా.. ప్రస్తుతం గుండెపోటు, హృద్రోగ సంబంధిత వ్యాధులు పెరిగిపోతుండటంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ‘‘వరల్డ్ హార్ట్ డే’’ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గుండె సంబంధిత వ్యాధుల బారినపడకుండా చూసుకోవడంపై ఆ రోజున అవగాహన కల్పిస్తారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కార్డియో వాస్క్యులర్ వ్యాధులు (సీవీడీ) మరణాలు భారత్‌లో నమోదవుతాయని అంచనా.

గుండె ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే:

క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం, ఒత్తిడికి దూరంగా వుండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్, సోడియం, కొవ్వు, చక్కెర ఎక్కువగా వుండే ఆహారాలకు బదులుగా ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోవాలి. ఓట్స్, గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్ వంటివి ఆహారంలో తీసుకోవాలి. రోజుకు అర్ధగంట తక్కువ కాకుండా ఇంటి వద్దే వాకింగ్, రన్నింగ్, వార్మప్ చేయడం, తోటపనిలో నిమగ్నమవడం వంటివి సరిపోతాయి. అలాగే మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లకు దూరంగా వుండి వీలైనంత త్వరగా నిద్రపోవడం వంటి వల్ల గుండె జబ్బులను నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.