close
Choose your channels

Bharti:పులివెందులలో సీఎం జగన్ సతీమణి భారతి ప్రచారం.. షర్మిలను ఢీకొట్టేనా..?

Saturday, April 13, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో పోలింగ్‌కు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పార్టీల అధినేతలు వరుసపెట్టి సభలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఐదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. ఈనెల 25వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలందరూ ఏయే తేదీల్లో నామినేషన్లు వేయాలో ముహుర్తాలు చూసుకుంటున్నారు. తాజాగా సీఎం జగన్ కూడా ఏప్రిల్ 25వ తేదీన పులివెందుల నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.

అయితే అంతకుముందే ఏప్రిల్ 22వ తేదీ జగన్ తరపున ఓ సెట్ నామినేషన్‌ను కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేస్తారు. నామినేషన్ దాఖలు అనంతరం పార్టీ అధినేతగా జగన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేయనున్నారు. దీంతో పులివెందులలో తన తరపున ప్రచారం బాధ్యతలను ఆయన సతీమణి భారతికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు పులివెందులలో ప్రచారాన్ని భారతి దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సమాచారం. ప్రచారంలో ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీ కార్యాలయం నుంచి టెక్నికల్ టీమ్ సపోర్ట్ తీసుకోనున్నారట.

ఎప్పుడు ఎక్కడ సభలు, ర్యాలీలు నిర్వహించాలనే అంశాలను ఆ టీమ్ సభ్యులు ఇప్పటికే సిద్ధం చేశారు. అలాగే పులివెందులలోని స్థానిక పెద్దల సహకారంతో ఆమె పార్టీ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి సన్నద్ధం అవుతున్నారట. దీంతో భారతి ప్రచారం ఆసక్తిగా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే కడప ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పులివెందులలో జగన్‌కు వ్యతిరేకంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. షర్మిలకు తోడుగా వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా జగన్‌ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారాన్ని హంతకులను కాపాడటానికి జగన్ వినియోగిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని.. తిరిగి హంతుకుడికే ఎంపీ టికెట్ ఇచ్చారంటూ ఘాటు విమర్శలతో ప్రచారం వేడెక్కిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వారి విమర్శలకు ధీటుగా బదులు ఇచ్చేందుకు భారతి ప్రచార బరిలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఓవైపు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, ఎంపీ అవినాష్ రెడ్డి.. మరోవైపు వైయస్ షర్మిల, సునీతారెడ్డి పోటాపోటీగా ప్రచారం చేయనున్నారు. అందులోనూ వివేకానందరెడ్డి హత్య అంశమే ప్రధాన ఎజెండాగా షర్మిల ఎన్నికల ప్రచారం చేస్తుండటంటతో.. ఆమెకు కౌంటర్‌గా భారతి ఎలా స్పందిస్తారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి దివంగత సీఎం వైయస్సార్ కుటుంబానికి చెందిన కుటుంబసభ్యులు ఇలా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దువ్వడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.