close
Choose your channels

దాడులు జరగకుండా చూడాలి.. సీఎస్, డీజీపీకి ఈసీ, హైకోర్టు ఆదేశాలు

Thursday, May 16, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దాడులు జరగకుండా చూడాలి.. సీఎస్, డీజీపీకి ఈసీ, హైకోర్టు ఆదేశాలు

ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల కట్టడికి ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ సీఎస్, డీజీపీలపై మండిపడింది. తక్షణమే ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, నిఘా చీఫ్ కుమార్ విశ్వజిత్ ఈసీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విచ్చల విడిగా దాడులు, వాహనాలు తగులబెట్టడం వంటి ఘటనల్ని ఎందుకు అదుపు చేయలేకపోయారని నిలదీసినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపుచేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఈసీ.. దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఎన్నికల సంఘం అధికారులు వీరి నుంచి వివరణ తీసుకొని పంపించినట్లు సమాచారం.

పల్నాడు, తాడిపత్రిల్లో దాడులు, చంద్రగిరిలో ఏకంగా టీడీపీ అభ్యర్థిపైనే దాడిచేయడం వంటి ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆరా తీసిన ఈసీ అధికారులు.. ఇంటెలిజన్స్ సమాచారం ఎందుకు తీసుకోలేకపోయారని నిలదీశారట. ముందుగానే హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారు? అభ్యర్థిపైనే దాడి చేస్తుంటే ఎందుకు తగిన విధంగా స్పందించలేదనే అంశాలపై వివరణ కోరినట్లు సమాచారం. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి గొడవలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. అలాగే స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పటిష్టం చేయాలంది. కౌంటింగ్ డే రోజున కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి.

దాడులు జరగకుండా చూడాలి.. సీఎస్, డీజీపీకి ఈసీ, హైకోర్టు ఆదేశాలు

మరోవైపు పల్నాడు సహా పలు జిల్లాల్లో అల్లర్లు జరగడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల తర్వాత కూడా దాడులు ఆగట్లేదని.. పరిస్థితులను అదుపుచేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. తక్షణమే అల్లర్లు జరగకుండా సీఎస్‌, డీజీపీని ఆదేశించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం గొడవల్ని అరికట్టాలని సీఎస్‌, డీజీపీతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా ఆదేశాలు జారీ చేసింది.

కాగా పోలింగ్ సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి, చీరాల, అనంతపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది. రాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సిఐలు మార్చిన చోట హింస చెలరేగింది. ఇక రాష్ట్రానికి వచ్చిన పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అదునుగా భావించి టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు ఓటమి భయంతో హింసకు తెరలేపారని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో పోలింగ్ అయిపోయినా కానీ పరిస్థితులు మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే లోపు ఎలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయో అనే ఆందోళనలో సామాన్య ప్రజలు ఉన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.