close
Choose your channels

Ex IAS Officer:ఏపీలో కొత్త పార్టీని ప్రకటించిన మాజీ ఐఏఎస్ అధికారి..

Thursday, February 15, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్నికల వేళ ఏపీలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుస పెట్టి పార్టీలు పెట్టేస్తున్నారు. ఇటీవల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (LaxmiNarayana)సొంతంగా పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్(Vijay Kumar) లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని(Liberation Congress Party)స్థాపించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికజన మహాసంకల్ప సభలో పార్టీ పేరును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు.

పేదల కోసం యుద్ధం చేస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్, పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకిచ్చి నిజాయితీ చాటుకోవాలని సవాల్ విసిరారు. దౌర్జన్యంగా పేదల నుంచి భూములు లాక్కున్న వారికి ఆస్తులు చెందేలా చట్టాన్ని మార్చుకున్నారని విమర్శించారు. సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు వెళ్లలేక గిరిజనులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి లేక వలస వెళ్తున్నారని.. మద్యం విచ్చలవిడిగా దొరకడంతో మత్తుకు బానిసలుగా మారుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు.

కాగా జగన్ ప్రభుత్వంలో విజయ్ కుమార్ కీలకంగా పనిచేశారు. బహిరంగసభల్లో జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ అధికారుల్లో ఒకరని చెబుతుంటారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో రిటైర్డ్ అయ్యాక ఆయన వైసీపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ప్రకాశం జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర కూడా చేపట్టారు. అయితే ఏమైందో ఏమో కానీ సడెన్‌గా కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం దళితుల ఓట్లు చీల్చేందుకే ఆయన చేత పార్టీ పెట్టించారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కొద్ది రోజు క్రితమే జై భారత్‌ నేషనల్‌ పార్టీని ప్రకటించారు. ఐపీఎస్ అధికారిగా మంచి పేరు సంపాదించుకున్న ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బయటకు వచ్చి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. అయితే అధికారులు పార్టీలు పెడుతున్నారు సరే ప్రజల్లో ఏమేరకు విశ్వాసం పొందగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పార్టీ పెట్టి నడపడం కష్టమని చెబుతున్నారు. ఎన్నికలు అయిపోయి ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడితే తప్ప పార్టీలకు మనుగడ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి సమయంలో ఈ మాజీ బ్యూరోక్రాట్లు పెట్టిన పార్టీలు ఏమేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.