close
Choose your channels

వీర జవాన్ల కుటుంబాలకు కొండంత అండగా ప్రముఖులు

Saturday, February 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వీర జవాన్ల కుటుంబాలకు కొండంత అండగా ప్రముఖులు

పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తోంది. మరోవైపు పలువురు ప్రముఖులు ఆ కుటుంబాలకు కొండంత ధైర్యమిస్తూ అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. రిలయన్స్ గ్రూప్స్, ఏపీ సర్కార్, నటుడు విజయ్ దేవరకొండ, బాక్సర్ విజేందర్ సింగ్‌‌తో పాటు పలువురు ప్రముఖులు తమవంతు సాయం ప్రకటిస్తున్నారు.

రిలయన్స్ గ్రూప్స్..

ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారత్‌‌లో విపత్తులు వచ్చినప్పుడు ముందుండే రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌కు చెందిన రిలయన్స్ పౌండేషన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల పిల్లలకు విద్య, ఉపాధితో పాటు కుటుంబ జీవనోపాధి బాధ్యతలను స్వీకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాదు ఉగ్రదాడిలో గాయపడిన జవాన్లకు రిలయన్స్ అనుబంధ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సాయుధ బలగాల కోసం ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోని ఏ దుష్ట శక్తీ.. భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయలేదని.. మానవత్వానికి టెర్రరిజమే పెద్ద శత్రువని రిలయన్స్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏపీ సర్కార్...

పుల్వామా ఘటన గురించి విన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ తరఫున అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "పుల్వామా దాడి వల్ల అపార నష్టం వాటిల్లింది. భర్తీ చేయలేని నష్టానికి పరిహారంగా సంతాపాలు.. ఓదార్పు మాటలతో సరిపెట్టలేం. దేశం యావత్తూ సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తోంది. ఈ కష్ట కాలంలో అమరుల కుటుంబాలకు బాసటగా ఉండాలని భావించాం" అని ట్విట్టర్ వేదికగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడంతోపాటు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. బాబు ప్రకటన అనంతరం పలువురు అభిమానులు, కార్యకర్తలు సైతం తమవంతుగా సాయం చేయడం మొదలుపెట్టారు.

నెల జీతం విరాళంగా ఇస్తున్నా..

పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి తన నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు బాక్సర్ విజేందర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అనంతరం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆ కుటుంబాలకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలా చేయడం మనందరి నైతిక బాధ్యత.. జవాన్ల త్యాగాలకి విలువనిచ్చి గర్వపడేలా చేయాలన్నారు. దేశంలో వంద కోట్ల మందిపైనే ఉన్నామని ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క రూపాయి విరాళంగా ఇచ్చినా.. అది రూ.100 కోట్లు పైనే అవుతుందన్నారు. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు.. కానీ ఇది మనం అమరులకి ఇచ్చే గౌరవమని విజేందర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ బాక్సర్‌‌ ట్వీట్‌‌కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. పలువురు క్రీడాభిమానులు, క్రీడాకారులు ఈయన్ను ఆదర్శంగా తీసుకుని విరాళంగా ప్రకటించాడనికి సిద్ధమయ్యారు.

సైనిక హీరోల కోసం విజయ్ దేవరకొండ సాయం

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఎక్కడైనా విపత్తులు వచ్చినా ముందుగా స్పందించి తన వంతుగా విరాళం ప్రకటించే రియల్ హీరో విజయ్ దేవరకొండ. తాజాగా పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచిన ఆయన.. తనవంతుగా విరాళం ప్రకటించారు. అయితే ఎంత విరాళంగా ప్రకటించారనేది ఆ సర్టిఫికెట్స్‌‌లో బ్లర్ చేసి ఉండటంతో తెలియరాలేదు. ఈ సందర్భంగా తన వంతు సాయం చేశానని మీరు కూడా మీవంతుగా విరాళాలు ప్రకటించాలని అభిమానులు, సినీ ప్రియులను విజయ్ కోరారు.

మనం ఎంత సాయం చేశామా అన్నది ముఖ్యం కాదు.. కష్ట సమయంలో సైనికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు.. జవాన్ల మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా బాసటగా నిలవాలని విరాళాలు ప్రకటించిన పెద్దలు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. సో.. మీరు కూడా మీవంతుగా విరాళం ప్రకటించండి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.