close
Choose your channels

Governor:తమది ప్రజా ప్రభుత్వం.. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం

Friday, December 15, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో తన ప్రసంగం ప్రారంభించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని.. అందుకే ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమన్నారు. దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడి పెడుతూనే సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వెల్లడించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో తమ పాలన దేశానికే ఆదర్శం కాబోతోందన్నారు.

ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టామని తెలిపారు. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని ఆమె స్పష్టంచేశారు. ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. మహాలక్ష్మీ పథకంలోని మిగత పథకాలను అతి త్వరలో అమలు చేస్తామని చెప్పారు. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు .

అలాగే హైదరాబాద్‌లో ఇచ్చిన యువ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. వచ్చే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ఇప్పటికే కార్యచరణ ప్రారంభించామన్నారు. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని ఆమె పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం మాటల కంటే చేతల్లో ఎక్కువ చూపిస్తుందని భవిష్యత్‌లో ఆ మార్పు ప్రజలే గమనిస్తారని చెప్పకొచ్చారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని చెబుతూ దాశరథి సూక్తులతో ప్రసంగం ముగించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.