close
Choose your channels

ఏపీలో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల

Tuesday, April 2, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల

ఏపీలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత రెండు రోజుల నుంచి పింఛన్ల పంపిణీపైనే తీవ్ర విమర్శల యుద్ధం కొనసాగుతోంది. వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీని టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకున్నారని సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేక తమపై బుదర జల్లుతున్నారని టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు.

ఇదిలా ఉండగానే పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 3 మధ్యాహ్నం నుంచి 6వ తేదీ సాయంత్రం వరకు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. రెండు విధానాల్లో పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. దివ్యాంగులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైనవారు, వితంతువులకు మాత్రం ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేయనున్నారు.

మిగిలిన లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ద్వారా పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దూర ప్రాంతాల నుంచి పింఛన్ కోసం వచ్చే గిరిజన ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇందులో కొంతమందికి బీఎల్వోలుగా ఇప్పటికే ఎన్నిక‌ల విధులు అప్పగించింది.

ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీకి తగినంతగా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవటంతో రెండు విధాలుగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయాల్లో ఉద‌యం 9 గంటల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కూ సిబ్బంది సేవలు అందించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ విడుదల చేశారు.

కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్లతో పెన్షన్ నగుదు పంపిణీ చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్నికల ప్రచారంలో సైతం వాలంటీర్లు పొల్గొనకూడదని ఎవరైనా ప్రచారం చేస్తే విధుల నుంచి తప్పిస్తూ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇప్పటికే కోడ్ నిబంధలను ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లను విధుల నుంచి తప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రసవత్తరంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.