జనసైనికుడిపై ఎమ్మెల్యే వీరంగం.. మనస్థాపంతో ఆత్మహత్య
జనసేన కార్యకర్తపై ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు విరుచుకు పడ్డారు. తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినందుకు జనసైనికుడు ఆయన ఆగ్రహానికి గురవడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాంబాబు బేస్తవారిపేట మండలంలోని సింగరపల్లికి వెళ్లారు. అక్కడ జనసేన కార్యకర్త వెంగయ్య తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహం పట్టలేక ఎమ్మెల్యే రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు .
అంతటితో ఆగక ఎమ్మెల్యే రాంబాబు తిట్ల పురాణం అందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సోమవారం వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంగయ్య ఆత్మహత్యకు ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులే కారణమని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. అయితే మానసిక స్థితి సరిగా లేకనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రాంబాబు తిట్ల పురాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.