close
Choose your channels

Pawan Kalyan : అప్పుడే స్పందించి వుంటే.. ఇలా జరిగేదా : డాక్టర్ ప్రీతిపై పవన్ దిగ్భ్రాంతి

Monday, February 27, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియర్ విద్యార్ధి వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి చివరికి ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచింది. ప్రీతి మరణం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

ర్యాగింగ్‌ను ప్రభుత్వం కట్టడి చేయాలి:

‘‘ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్ధిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సీనియర్ వైద్య విద్యార్ధి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్ధితులు , కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించింది. తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ వున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యలు సరైన రీతిలో స్పందించి వుంటే ఇటువంటి దురదృష్టకర పరిస్ధితి వచ్చేది కాదు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. కళాశాలలో ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలి. సీనియర్ విద్యార్ధుల ఆలోచనా ధోరణి మారాలి. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడటం, ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలి’’ అని పవన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే :

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ చదువుతోన్న ప్రీతి .. సీనియర్ విద్యార్ధి వేధింపులు భరించలేక ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రమాదకర ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితికి చేరుకుంది. దీనిని గమనించిన తోటి విద్యార్ధులు ఆమెను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు . అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. రోజులు గడుస్తున్నా.. ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ రాలేదు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని, వెంటిలేటర్‌పై, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెబుతూ వచ్చారు. ఈ దశలో ఆదివారం ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం, బ్రెయిన్ డెడ్ కావడంతో ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.