close
Choose your channels

సజ్జల ఏం చెప్పారో.. మంత్రుల నోటా అదే, అంతా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే: జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ

Saturday, May 28, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో వైసీపీ ప్రభుత్వం చలి కాచుకుంటోందని ఆరోపించారు జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఇంటి మీద దాడి నుంచి మంత్రుల వ్యాఖ్యల వరకు అంతా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోందని రామకృష్ణ దుయ్యబట్టారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పంపిణీ చేసిన స్క్రిప్ట్ నే మంత్రులంతా చదివి వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఇంత అట్టుడుకుతుంటే దావోస్‌లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కనీసం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం శోచనీయమన్నారు.

144 సెక్షన్ అమలులో ఉంటే అంత మంది ఎలా వచ్చారు:

అమలాపురం ఘర్షణలు ప్రభుత్వ కల్పితాలేనని రామకృష్ణ ఆరోపించారు. మంత్రి విశ్వరూప్, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లపై జరిగిన దాడుల మీద రాష్ట్ర ప్రజానీకానికి ఎన్నో సందేహాలు ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అంత మంది మంత్రి ఇంటి మీద దాడికి ఎలా పాల్పడ్డారు.. అంత మంది గుంపుగా వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అంత పెట్రోల్ ఎలా తీసుకువచ్చారు..? మంత్రి కుటుంబాన్ని ముందుగానే ఎవరు ఖాళీ చేయించారుని రామకృష్ణ ప్రశ్నల వర్షం కురిపించారు.

రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేందుకేనా రోజా, జోగి రమేశ్‌లకు మంత్రి పదవులు:

పోలీసులు చెప్పారు.. కాదు వైసీపీ కార్యకర్తలు చెప్పారు.. అంటూ అస్పష్టమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చటి కోనసీమలో కులాల చిచ్చు పెట్టి తద్వారా ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వమే ఈ గొడవలు సృష్టించిందని జనం బలంగా నమ్ముతున్నారని ఆయన స్పష్టం చేశారు. అల్లర్లు పూర్తి కాగానే సజ్జల ఏం మాట్లాడారో అదే స్క్రిప్ట్ పొల్లు పోకుండా మంత్రులంతా పదే పదే చదివి వినిపిస్తున్నారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. మంత్రులు రోజా, జోగి రమేష్ లాంటి వారికి ఆ పదవులు ఇలాంటి స్క్రిప్ట్ లు చదివి అప్పచెప్పడానికేనా ప్రశ్నించారు. ఈ రోజు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఉంటే మా జనసైనికులందరికీ పోలీసులు వెళ్తున్నారా అని ఫోన్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా ప్రకటనకు కూడా ఉలిక్కిపడుతున్న పరిస్థితుల్లో మంత్రుల ఇళ్లు తగులబెట్టే వరకు పోలీసులు ఏం చేస్తున్నారని రామకృష్ణ ప్రశ్నించారు.

పవన్‌ని ఒక్క మాటన్నా నానికి జనసైనికుల నుంచి తిరుగుబాటు తప్పదు :

కాల్పులు జరిపితే శాంతి భద్రతలు మరింత అదుపుతప్పే ప్రమాదం ఉన్నందువల్లే ఆ పని చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ మాజీ గుట్కా మంత్రి శెలవిస్తున్నారని ఆయన చురకలు వేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడాలి అంటే కాల్పులు జరపాలా? ఇలాంటి అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేసే మంత్రి పదవి ఊడగొట్టుకున్నారని రామకృష్ణ ఫైరయ్యారు. ముఖ్యమంత్రి పక్కన పెట్టేసినా సిగ్గు రాలేదని... అస్సలు గుట్కా వ్యాపారాలు, గోవా క్యాసినోలు మినహా గుడివాడ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా అని నానిని ప్రశ్నించారు. మూడేళ్ల పాటు మంత్రి పదవి వెలగబెట్టి ఒక్క రోడ్డు అయినా వేశారా.. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదని రామకృష్ణ విమర్శించారు. ఇంకోసారి మాట జారితే జనసైనికుల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని నానికి హెచ్చరికలు పంపారు.

వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధం:

రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే విధ్వంస రచనలు చేస్తోందని బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు. దావోస్‌లో సేల్స్ మ్యాన్ డ్యూటీలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రికి అమలాపురంలో ఇంత విధ్వంసం జరిగితే కనీసం ప్రజలకు శాంతి సందేశం పంపే తీరిక లేదా అని ప్రశ్నించారు. మీ బండారం మొత్తం బయటపడి పోయిందని... ప్రజలు మిమ్మల్ని గద్దె దించేందుకు సిద్ధమై పోయారని రామకృష్ణ జోస్యం చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos