close
Choose your channels

Nadendla Manohar:హెలికాఫ్టర్‌లో చక్కర్లు , పరదాల మాటున పర్యటనలు.. జనానికి కరెంట్ షాక్‌లు : జగన్‌ పాలన‌పై నాదెండ్ల సెటైర్లు

Monday, June 12, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలికి చెందిన పలువురు నాదెండ్ల సమక్షంలో జనసేనలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు మనోహర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ముఖ్యమంత్రి ప్రజలను కలవడు.. సమస్యలు తెలుసుకోడు.. హెలికాప్టర్ లో వస్తాడు.. పరదాల మాటున పర్యటన చేసి వెళ్ళిపోతాడంటూ సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేస్తే పదే పదే కరెంట్ షాక్‌లు కొట్టిస్తోందని నాదెండ్ల దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల బాదుడుకు సామాన్యులు నలిగిపోతున్నారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఏదో చేస్తాడని నమ్మి ఓట్లు వేసిన జనానికి నరకం కనిపిస్తోందని మనోహర్ విమర్శలు గుప్పించారు. ఇక ఈ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా తెనాలిలో 13 రోజులు పాటు పాదయాత్రలో జగన్ రెడ్డి తిరిగితే ఆశ్చర్యం వేసిందన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇదే వ్యక్తి 23 కిలో మీటర్ల దూరంలోని తెనాలికి హెలికాప్టర్‌లో వచ్చారని నాదెండ్ల చురకలంటించారు. కనీసం ప్రజలను కలుసుకున్నది, మాట్లాడింది కూడా లేదని.. ఆరు లక్షల కోట్లు అప్పు చేసి బటన్ నొక్కుతున్నామని చెబుతూ కరెంట్ షాక్ కొట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల నుంచి లంచాలు :

పంట అమ్ముకుందామన్నా, ఈ క్రాప్ నమోదు చేసుకుందామన్నా రైతుల వద్ద నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారని మనోహర్ ఆరోపించారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి, పన్నుల పేరుతో రెండు చేతులతో లాగేసుకుంటున్న ప్రభుత్వం గురించి ప్రజలు ఆలోచించాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. ప్రజల దగ్గర్నుంచి చెత్త పన్నులు కూడా వసూలు చేస్తూ , ఆ డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సమస్య తీర్చమని అడిగితే ఇంటికి స్టిక్కర్లు వేస్తున్నారని.. మన ఆస్తులు మీద ముఖ్యమంత్రి ఫోటో అతికిస్తున్నారని నాదెండ్ల ఎద్దేవా చేశారు. భూమి పాస్ పుస్తకాల మీద సీఎం ఫోటోనే.. సర్వే రాళ్ల మీద ముఖ్యమంత్రి ఫోటోనేనంటూ మనోహర్ సెటైర్లు వేశారు. ఒక వ్యక్తి వల్ల ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో ప్రజలు ఆలోచించాలని.. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపేసి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినందుకు వారం రోజులు పాటు నిర్బంధించి యువకులను హింస పెడుతున్నారని.. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ప్రభుత్వం కక్ష కడుతోందని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిర్వీర్యం:

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి చెందిన 35% మంది యువత నిరుద్యోగంలోకి వెళ్లిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమ లేదు.. ఇచ్చిన ఉద్యోగం లేదని.. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని మనోహర్ ఆరోపించారు. ఇద్దరు ఆడపిల్లలు పుడితే గతంలో లక్ష రూపాయలు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చామని.. దానికి అప్పట్లోనే బాండ్లు తయారు చేసి లబ్ధిదారులకు ఇచ్చామని నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. మహిళలు దాచుకున్న సొమ్ముకే, ప్రభుత్వం మరికాస్త జోడించి ఆ డబ్బులు పిల్లల ఖాతాలో వేసేదని ఆయన వెల్లడించారు. ఇటీవల మెచ్యూర్ అయిన బాండ్లకు డబ్బులు ఇవ్వమని అడిగితే అలాంటి పథకం ఏది లేదని ప్రభుత్వం చెబుతోంది నాదెండ్ల మండిపడ్డారు.

తెనాలి అభివృద్ధే ముఖ్యం:

తమకు ఎవరి మీదా ద్వేషం కానీ, కోపం కానీ లేదన్న ఆయన అందరినీ కలుపుకొని వెళ్తామని స్పష్టం చేశారు. మాకు కావాల్సింది తెనాలి నియోజక వర్గం అభివృద్ధి మాత్రమేనని తేల్చిచెప్పారు. పదవి ఒక బాధ్యత అని.. దానిని మర్చిపోతే కచ్చితంగా ప్రశ్నిస్తామని నాదెండ్ల అన్నారు. విజయవాడ , గుంటూరు వంటి నగరాలను తలపించేలా తెనాలిని అభివృద్ధి చేయాలని భావించామని ఆయన గుర్తుచేశారు. ఇందుకోసం రూ.130 కోట్లతో తెనాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం కోసం నిధులు విడుదల చేయిస్తే , తర్వాత ఆ పనులను కనీసం చక్కబెట్టుకోలేకపోయారని మనోహర్ పేర్కొన్నారు.

పూడికతో నిండిపోయిన బకింగ్‌హామ్ కెనాల్ :

బకింగ్ హామ్ కెనాల్ సామర్ధ్యం 2000 క్యూసెక్కులు అయితే, దానిలో పూడిక పేరుకుపోయి కనీసం 600 క్యూసెక్కుల నీరు కూడా రావడం లేదని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో గతంలో ప్రతి వార్డుకు రూ. 2 లక్షలు నిధులు ఇచ్చేవాళ్లమని.. ఇప్పుడు ఏ వార్డుకు నిధులు వచ్చిందే లేదన్నారు. పెదరావూరు నుంచి మంగళగిరి వరకు నాలుగు లైన్ల రహదారి వచ్చేస్తోందని రూ.200 కోట్ల నిధులు విడుదలయ్యాయని చెప్పిన ఎమ్మెల్యే తర్వాత దాని గురించి మాట్లాడటం లేదని నాదెండ్ల మనోహర్ చురకలంటించారు.

ఒకప్పుడు తెనాలిలో ఎకరా రూ.కోటి :

అమరావతి రాజధాని అవుతుందని ఒకప్పుడు తెనాలిలో ఎకరా రూ. కోటి పలికేదని.. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కొనేవారు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా అవసరం ఉండి భూములు అమ్ముదామని రైతులు భావించినా ధరలు లేవన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేశానని..తెనాలికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలన్నదే తన లక్ష్యమన్నారు. గతంలో జరిగిన అభివృద్ధి , ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు పరిశీలించాలని , మళ్లీ తెనాలిని అద్భుతమైన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.